దొరికిన మరో దొంగ!
♦ ముఠా సభ్యుల్లో ఒకరి రిమాండ్
♦ కొనసాగుతున్నవిచారణ..
♦ నేరచరితపై ఆరా..?
పరిగి: పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి అంతర్రాష్ట్ర దొంగల ముఠా కాల్పులకు యత్నించిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనలో విచారణ కొనసాగుతోంది. అర్ధరాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులపై దుండగులు కాల్పులకు యత్నించటంతో వారిలో ముగ్గురిని పోలీసులు పట్టుకోగా మరో నిందితుడు తప్పించుకుని పారిపోయిన విషయం తెలిసిందే. దొరికిన వారిని విచారణ జరిపిన పోలీసులు పరారైన మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముందుగా దొరికిన ముగ్గురు నిందితుల్లో ఒకరైన సమద్ అనే వ్యక్తిని ఆదివారం రాత్రి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని పరిగి సీఐ ప్రసాద్ నిర్ధారించినా ఇంకా గోప్యంగానే ఉంచారు. పోలీసులు రోజు వారి కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ కేసు దర్యాప్తులో తలమునకలయ్యారు. అయితే, పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు గుల్బర్గా ఆర్టీఓ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవగా ఓనర్ ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే దొంగల ముఠా కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతంలోనే ఎక్కువగా దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అదుపులో ఉన్న అనుమానితులను తీసుకుని ఇప్పటికే ఓ బృందం కర్ణాటక గుల్బర్గాకు వెళ్లి రావడంతో మరిన్ని విషయాలు, దోపిడీలు వెలుగు చూసినట్లు సమాచారం. అయితే కేవలం అందరికి కనిపించిన దొంగను మాత్రమే రిమాండ్‌కు తరలించిన పోలీసులు మిగతా వారి అరెస్టు చూపలేదు