పెర్కిట్(ఆర్మూర్): భీంగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏర్గట్ల మండల కేంద్రంలో గత ఫిబ్రవరి 27వ తేదీన ఎస్‌బీఐ బ్యాంకులో చోరీకి పాల్పడిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన భీంగల్ సీఐ సైదయ్య, సీసీఎస్ సీఐ నరేశ్‌కుమార్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. బిహార్ రాష్ట్రం ముజాఫర్‌పూర్ జిల్లాకు చెందిన శివశంకర్ షా, సురేందర్ సహాని ఫిబ్రవరి 25వ తేదీన కూలిపని నిమిత్తం ఏర్గట్ల గ్రామానికి వచ్చారు. అనంతరం గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకు దోపిడీకి పన్నాగం పన్నారు. రెండు రోజులు రెక్కి నిర్వహించిన అనంతరం 27వ తేదీన ముసుగులు ధరించి బ్యాంకులో చొరబడ్డారు. సీసీ కెమెరాను ధ్వంసం చేసి లాకర్‌ను తెరిచే ప్రయత్నం చేశారు.
లాకర్ తెరుచుకోకపోవడంతో అక్కడే ఉన్న ఐదు కంప్యూటర్ మానిటర్లను దొంగలించి ఉడాయించారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ ఫణిరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీపీ కార్తికేయ ప్రత్యేక బృందాలతో కేసును దర్యాప్తు చేయించారు. భీంగల్ సీఐ సైదయ్య, సీసీఎస్ సీఐ నరేశ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులను రెండు రోజుల క్రితం బిహార్‌లో అరెస్టు చేశారు. అనంతరం నిందితులను అక్కడి కోర్టులో హాజరు పరిచి ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఏర్గట్ల ఎస్సై హరిప్రసాద్, ఐడీ కానిస్టేబుళ్లు రాజేందర్, రమేశ్, రాములు, నరేందర్, సురేందర్, గంగాప్రసాద్, కేర్ బాజీ, గంగాధర్‌కు రివార్డులను అందజేయనున్నట్లు ఏసీపీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment