ఎర్రజొన్న రైతులపై కాల్పులకు పదేళ్లు | Fire On Farmers | Sakshi
Sakshi News home page

ఎర్రజొన్న రైతులపై కాల్పులకు పదేళ్లు

Published Sat, Jun 16 2018 2:06 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

Fire On Farmers - Sakshi

దీక్షను విరమింపజేస్తున్న అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌(ఫైల్‌) 

ఆర్మూర్‌ : ఆర్మూర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎర్రజొన్న రైతులపై పోలీసుల కాల్పుల ఘటన జరిగి నేటితో పదేళ్లు పూర్తయినా నాటి ఘటనను ఈ ప్రాంత ప్రజలు నేటికీ నెమరు వేసుకుంటున్నారు. అయితే నాటి ఎర్రజొన్న రైతులపై పోలీసు కాల్పులకు దారి తీసిన పరిస్థితులు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సరిదిద్దుతూ రైతులకు లాభం చేకూర్చే పనులు చేస్తూ వస్తోంది.

ఎర్రజొన్న రైతులకు చెల్లించాల్సిన రూ. పది కోట్ల 83 లక్షలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించింది. మరో వైపు ఎర్రజొన్న రైతులను ఆదుకోవడంలో భాగంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది రాష్ట్ర ప్రభుత్వం విత్తన వ్యాపారంలోకి అడుగు పెట్టి ఎర్రజొన్న రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చింది. ఇక నాటి ఉద్యమంలో మిగిలిన డిమాండ్‌ విత్తన విధానంపై మేధావులతో, రైతు నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈ ఒక్క సమస్యను పరిష్కరిస్తే ఇక ఆర్మూర్‌ ప్రాంతంలో ఎర్రజొన్న రైతుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించబడినట్లే. నాటి ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడిగా ఆరు రోజుల పాటు ఆమరణ దీక్ష చేసిన ప్రస్తుత ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పోలీసు కాల్పులలో గాయపడిన రైతులను పరామర్శించడానికి వచ్చిన ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు సమస్యపై పూర్తి అవగాహన ఉండడంతో పరిష్కార మార్గాలు చూపడంలో సఫలమవుతున్నారు.

గతేడాది ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఉద్యమం బాట పట్టడంలో ఎంపీ కవిత, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లు సీఎం కేసీఆర్‌తో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా ఎర్రజొన్నల కొనుగోలును ప్రారంభించారు.

జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదు లక్షల 4 క్వింటాళ్ల ఎర్ర, తెల్ల జొన్నలను కొనుగోలు చేశారు. గిట్టుబాటు క్వింటాలుకు ధరను రూ. 2,300 ప్రకటించడంతో రైతులు పంటను ప్రభుత్వానికి విక్రయించారు. 

ఏం జరిగిందంటే.. 

ఆర్మూర్‌ ప్రాంతంలోని సుమారు 25 వేల రైతు కుటుంబాలు ఎర్రజొన్నలను పండించారు. సీడ్‌ వ్యాపారులు సిండికేట్‌గా మారి ప్రతి ఏడాది రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేస్తుండడంతో ఈసారి క్వింటాలుకు రూ. 1,540  చెల్లించాలని రైతులు ఉద్యమించారు. ఆ ధర చెల్లించడానికి ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌కు చెందిన గోదావరి హైబ్రీడ్‌ సీడ్స్‌ కంపెనీ యజమాని మహిపాల్‌రెడ్డి ముందుకు వచ్చాడు.

దీంతో సీడ్‌ వ్యాపారి డిమాండ్‌ మేరకు ఈ ప్రాంతంలో పండించే ఎర్రజొన్న విత్తనాలన్నీ మహిపాల్‌రెడ్డికే అమ్మాలని కలెక్టర్‌ సమక్షంలో రాత పూర్వక ఒప్పందం కుదిర్చారు. రైతులు పండించిన సుమారు 5 లక్షల 11 వేల క్వింటాళ్ల ఎర్రజొన్నలను సీడ్‌ వ్యాపారి స్వాధీనం చేసుకున్నారు. 2 లక్షల 3 వేల క్వింటాళ్లకు మాత్రమే రూ. 1,540 క్వింటాలు చొప్పున రైతులకు రూ. 32 కోట్లు చెల్లించాడు. అనంతరం ఎర్రజొన్నలు ఢిల్లీ మార్కెట్‌లో అమ్ముడుపోకపోవడం, వ్యాపారికి బ్యాంకు రుణం రాకపోవడంతో రైతులకు చెల్లించాల్సిన రూ. 46 కోట్లు చెల్లించలేనని చేతులు ఎత్తేశాడు.

దీంతో ఆగ్రహించిన రైతులు పలుమార్లు ఉద్యమాలు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేపట్టారు. 2008 జూన్‌ 16న 44వ, 63వ జాతీయ రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చారు. రైతులు వేల సంఖ్యలో ఆర్మూర్‌కు తరలి రావడంతో ఉద్యమం అదుపు తప్పి హింసాయుతంగా మారింది. ఆందోళనకారుల ఆగ్రహం తారాస్థాయికి చేరడంతో సీడ్‌ వ్యాపారులు మహిపాల్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి ఇళ్లపై దాడులు చేసి ఇళ్లు తగలబెట్టారు.

మూడు ప్రభుత్వ వాహనాలకు నిప్పంటించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రైతులను నియంత్రించడానికి గాలిలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో నలుగురు రైతులు గాయపడ్డారు. వేల్పూర్‌ మండలం పడగల్‌కు చెందిన ఏనుగు శేఖర్‌కు బుల్లెట్‌ గాయమైంది. ఈ ఘటనతో దిగివచ్చిన ప్రభుత్వం ఏపీ సీడ్స్‌ కార్పోరేషన్‌ ద్వారా ఎర్రజొన్నలు కొనుగోలు చేయించడానికి నిర్ణయించి ఉద్యమాన్ని విరమింపజేసింది.

సీడ్‌ వ్యాపారి నుంచి సుమారు మూడు లక్షల క్వింటాళ్ల ఎర్రజొన్నలను స్వాధీనం చేసుకొని క్వింటాలుకు రూ. 1,200 చొప్పున రైతులకు రూ. 35 కోట్లు చెల్లించింది. ఏపీ సీడ్స్‌ ఎర్రజొన్నలు అమ్మగా వచ్చిన లాభాన్ని రైతులకు తిరిగి చెల్లించాల్సి ఉంది. లేని పక్షంలో సీడ్‌ వ్యాపారిపై న్యాయ పరమైన చర్యలు తీసుకొని బకాయిలు రాబట్టి రైతులకు 2008 ఆగస్టు నెలాఖరులోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

కానీ ఏపీ సీడ్స్‌ వారు ఎర్రజొన్నలు విక్రయించగా లాభాలు రాకపోవడంతో సుమారు రూ. 10 కోట్ల 83 లక్షలు బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ బకాయిలను ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు చెల్లించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement