మంగళవారం తన కార్యాలయంలో దొంగలముఠా వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. చిత్రంలో వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: నకిలీ నెంబర్ ప్లేట్లు తగిలించిన తెల్లరంగు ఐ20 కారులో సంచరిస్తూ మూడు కమిషనరేట్ల పరిధిలో వరుస నేరాలు చేసిన ఘరానా అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఎట్టకేలకు చిక్కింది. ఈ ఏడాది మార్చ్ నుంచి నాలుగు దఫాల్లో సిటీకి వచ్చిన ఈ గ్యాంగ్ 13 చోరీలు చేసింది. దీనికి ముందు 2015 లోనూ ఓ దొంగతనానికి పాల్పడింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో పంజా విసిరిన ఈ మీరట్ గ్యాంగ్‌ను ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం వెల్లడించారు. నలుగురిని పట్టుకుని వీరి నుంచి రూ.40 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.
ఢిల్లీ జైల్లో జట్టుకట్టిన ముఠా
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన షంషద్ అలియాస్ భూర వృత్తిరీత్యా తాపీ మేస్త్రీ. ఇతడిపై ఇప్పటివరకు అక్కడ 22 కేసులు నమోదయ్యాయి. ఇతడికి జైల్లోనే ఢిల్లీకి చెందిన ఆరిఫ్, మహ్మద్ వసీంలతో పాటు తౌఫీఖ్, హసీమ్, డానిష్‌లు పరిచయమయ్యారు. ఈ గ్యాంగ్‌కు జైల్లో కలిసిన కొందరు దొంగలు హైదరాబాద్ వెళ్ళమని సూచించారు. అక్కడి ఇళ్లల్లో బంగారం ఎక్కువగా ఉంటుందని సూచించడంతో ఈ ముఠా కన్ను నగరంపై పడింది.
కారులో వచ్చి దర్జాగా తిరుగుతూ..
మీరట్‌లోనే బెంజిమన్ పేరుతో ఉన్న ఓ తెల్లరంగు ఐ20 కారును ఆరిఫ్ ఖరీదు చేశాడు. ఇందులోనే ఒక్కో సందర్భంలో కొందరితో కలిసి హైదరాబాద్‌కి రావడం మొదలెట్టారు. కారులో కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి అందినకాడికి దోచుకుపోతారు. వరుసగా కొన్ని నేరాలు చేసిన తర్వాత మీరట్ వెళ్లిపోతారు. మళ్లీ పరిస్థితులు అనుకూలంగా మారాయని భావించాక మరోసారి వస్తారు. ఇలా మార్చ్, మే, జూన్, సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కి వచ్చిన ఈ గ్యాంగ్ 12 చోరీలు చేసింది.
ఎస్సార్‌నగర్ పోలీసులకు కలిసొచ్చిన ‘అనుభవం’
మీరట్ నుంచి స్కార్పియో వాహనంలో వచ్చిన ఓ గ్యాంగ్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఎస్సార్‌నగర్ తదితర ప్రాంతాల్లో పంజా విసిరింది. ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసును అధ్యయనం చేసిన పోలీసులు దాదాపు 70 సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను, సాంకేతిక ఆధారాలను బట్టి మీరట్ గ్యాంగ్‌గా భావించి పట్టుకున్నారు. వీరిని గత ఏడాది జూన్ 15న నగరానికి తరలించి అరెస్టు చేశారు. ఈ అనుభవమే తాజా ఐ20 గ్యాంగ్ చిక్కడానికి కారణమైంది. తాజా ముఠాకోసం రంగంలోకి దిగిన ఎస్సార్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వై.అజయ్‌కుమార్, ఎస్సై జి.శ్రీనివాస్‌లతో కూడిన బృందం నేరంచేసే తీరును విశ్లేషించారు. దీనికి తోడు సాంకేతికంగానూ ముందుకు వెళ్ళిన అధికారులు ఈ అంతర్రాష్ట్ర దొంగలు మరోసారి నేరం చేయడానికి సిటీకి వస్తున్నట్లు గుర్తించారు. దీంతో వలపన్ని మధురానగర్ దగ్గర కారును ఆపి తౌఫీఖ్, హసీమ్, డానిష్ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.40 లక్షల విలువైన కేజీన్నర బంగారం, వెండితో పాటు ఐ20 కారును స్వాధీనం చేసుకున్నారు.
జూన్ నెలలోనే 10 చోరీలు..
తాళం వేసి ఉన్న ఇళ్ళనే టార్గెట్‌గా చేసుకున్న ఈ గ్యాంగ్ ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధిలోని గుడిమల్కాపూర్ నవోదయకాలనీలో ఓ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లో 10 తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.లక్ష నగదు అపహరించుకుని వెళ్ళింది. ఆపై రాజేంద్రనగర్, ఎస్సార్‌నగర్, వనస్థలిపురం, నార్సింగి, మీర్‌పేటల్లో కలిపి మొత్తం 12 ఇళ్లల్లో పంజా విసిరింది.
Comments
Please login to add a commentAdd a comment