కేంద్రపాలిత ప్రాంతమైన యానాం తీరంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. అమెరికాలో వచ్చేంత స్థాయిలో కాకపోయినా.. చిన్నపాటి టోర్నడో అరగంట పాటు ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. 11 ఎకరాల రొయ్యల చెరువుల్లోకి ప్రవేశించడంతో మోటార్లు, ఏరియేటర్స్, వలలు, బర్డ్ ఫెన్సింగ్, వివిధ నిర్మాణాలు నాశనమయ్యాయి.
యానాం: అమెరికాలో ఏదో ఒకచోట నిత్యం సుడులు తిరుగుతూ విధ్వంసం సృష్టించే టోర్నడో కాకినాడ సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాం తీరంలో అరగంట పాటు ప్రజలను భయాందోళనలకు గురి చేసింది.
సుడులు తిరుగుతూ..
► యానాం శివారు అయ్యన్న నగర్, పరంపేట సముద్ర తీర గ్రామాల్లో శుక్రవారం విపరీతమైన వేగంతో సుడులు తిరుగుతూ బీభత్సం సృష్టించింది.
► తీరం నుంచి పక్కనే ఉన్న పెన్మెత్స సత్తిరాజు అనే రైతుకు చెందిన 11 ఎకరాల రొయ్యల చెరువుల్లోకి ప్రవేశించడంతో మోటార్లు, ఏరియేటర్స్, వలలు, బర్డ్ ఫెన్సింగ్‌లు ధ్వంసం అవడంతో భారీ నష్టం సంభవించింది.
► తీరాన్ని ఆనుకుని ఉన్న అయ్యన్న నగర్, పరంపేట, నీలపల్లి తదితర గ్రామాల్లోనూ కలకలం రేపింది. దీని ప్రభావంతో భారీ రేకుల పందిరి ఎగిరిపడింది. పలుచోట్ల ఇళ్ల ముందున్న కొబ్బరాకు దడులు, గుడిసెలు టోర్నడో సుడిగాలికి ధ్వంసమయ్యాయి.
► ఈ ప్రాంతంలో టోర్నడోలు గతంలో ఎప్పుడూ ఏర్పడకపోవడంతో చాలామంది మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.
► యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీనా ఘటనా స్థలానికి వచ్చి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
► తూర్పు తీరంలో.. ఇది రెండో టోర్నడోగా చెబుతున్నారు. గత నెల 4న కాకినాడ తీరంలోని భైరవపాలెం ప్రాంతంలో సముద్రం వెలుపల 4 కిలోమీటర్ల దూరంలో తొలి టోర్నడో ఏర్పడింది.
► వేటకు వెళ్లిన మత్స్యకారులు తప్ప ఇతరులెవరూ దానిని చూడలేదు.
టోర్నడోలు ఎందుకొస్తాయంటే..
► టోర్నడోలను మధ్య అక్షాంశాలలో ఏర్పడే తీవ్రమైన సుడి గాలులుగా చెబుతారు. వీటిలో గాలి ఉత్తరార్ధ గోళంలో అపసవ్యంగా తిరుగుతుంది.
► పరిసర ఖండాల నుంచి వీచే చలి గాలి, సముద్రపు వెచ్చని గాలి కలిసినపుడు టోర్నడోలు ఏర్పడతాయి.
► మేఘాలు గరాటు ఆకారంలో ఏర్పడతాయి. ఒక్కోసారి భూమిని కూడా చేరుతాయి. వీటివల్ల విపరీతమైన నష్టం సంభవిస్తుంది.
► సాధారణంగా టోర్నడోలు ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మిస్సిసిపీ, మిస్సోరీ లోయల ప్రాంతాల్లో ఏర్పడుతుంటాయి. చైనా, జపాను తీరాలకు ఆవల కూడా ఇవి సంభవిస్తుంటాయి.
యానాంలో టోర్నడో
Published Sat, Jul 18 2020 6:00 AM | Last Updated on Sat, Jul 18 2020 6:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment