ఓ వైపు ముదురుతున్న ఎండలు.. మరోవైపు విద్యుత్ సరఫరా మూడు గంటలు.. దీంతో పంటలు ఎక్కడికక్కడ ఎండుతున్నాయి. ఎడాపెడా కోసేస్తున్న విద్యుత్ కోతలకు ఎండుముఖం పడుతున్నాయి. రాత్రింబవళ్లు శ్రమించి పంటలు సాగు చేస్తే.. ఏదో అంతోఇంతో ఆదాయం వస్తుందని ఆశిస్తే.. అధికారులు.. ప్రజాప్రతినిధులు తమ జీవితాలతో ఆటాడుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా అందకపోవడంపై మండిపడుతున్నారు. మరోవైపు అటు పరిశ్రమలకు కూడా కోతల షాక్ తగులడంతో వాటినే నమ్ముకున్న కూలీలు ఉపాధి కరువై అవస్థలు పడుతున్నారు.
కడప అగ్రికల్చర్/పెండ్లిమర్రి, న్యూస్‌లైన్: రైతు ప్రభుత్వమని వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు ఇస్తామని చెప్పిన అప్పటి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, జిల్లా విద్యుత్ అధికారులు డబ్బా కొట్టారు. పరిశ్రమలకు నిలుపుదల చేసైనా రబీ పంటలను ఎండనివ్వమని హామీలు ఇచ్చి.. ఇప్పుడేమో కోతలు కోస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో మూడు గంటలే.......
విద్యుత్ సరఫరా చూస్తే చాలా అధ్వానంగా ఉంటోంది. క్షేత్రస్థాయిలో పగటిపూట ఇచ్చే ఐదు గంటల సరఫరాలో లైన్ ట్రిప్, ఎల్‌సీలు, ఉత్పత్తి కేంద్రాల వద్దనే కోతలు అంటూ రెండు గంటలు.. రాత్రి పూట ఇచ్చే రెండు గంటల సరఫరాలో కూడా సాంకేతిక లోపాలు, ఫీజులు పోయాయని ఒక గంట ఇలా మొత్తానికి మూడు గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా కావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులుగా వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా కాకపోవడ ం లేదు.
ఎండుతున్న పంటలు
వారం రోజులుగా వాతావరణంలో మార్పులు రావడం మరో పక్క వేసవి ఆరంభం కావడంతో ఎండలు మండుతున్నాయి. విద్యుత్ కోతలతో నీరు అందక పంటలు ఎండుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సాగు చేసిన వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, అరటి, బొప్పాయి,చీనీ, నిమ్మ, ఉల్లి, పత్తి, మిరప, టమాట, వంగ, పూల తదితర పంటలు విద్యుత్ కోతలతో ఎండుదశకు చేరుకున్నాయి. దీంతో విద్యుత్‌శాఖపై రైతులు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. వాణిజ్య, ఉద్యాన పంటలకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆందోళన పడుతున్నారు.
ఉపాధిపై దెబ్బ
ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: నాపరాయి పరిశ్రమలకు కరెంటు కోతల సెగ తగులుతోంది. ఇప్పటికే రోజుకు ఆరుగంటల కోతల ధాటికి పరిశ్రమలు కుదేలవుతుంటే.. పవర్ హాలిడే ధాటికి పరిశ్రమలు మూతవేసుకోవాల్సి వస్తుందేమోనని యజమానులు ఆందోళన పడుతున్నారు. మరోవైపు నాపరాయి పరిశ్రమపైనే ఆధారపడి బతుకుతున్న వేలమంది కూలీలు పనులులేక అల్లాడుతున్నారు.
ఎర్రగుంట్లలోని నాపరాయి పరిశ్రమ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. ఎర్రగుంట్లలో సుమారు 200 వరకు.. అలాగే జమ్మలమడుగు ప్రాంతంలోని సుగమంచుపల్లి గ్రామ పరిసర ప్రాంతాలలో పదుల సంఖ్యలో నాపరాయి పరిశ్రమలు ఉన్నాయి. వీటి ఆధారంగా నాపరాయి గనులు కూడ ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 15వేల నుంచి 20 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. మాలెపాడు, పోట్లదుర్తి, హనుమనగుత్తి, నిడుజివ్వి, చిలంకూరు, ఎర్రగుంట్ల తదితర గ్రామాల నుంచి చాలా మంది కూలీలు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు.
విద్యుత్ కోతలతో అవస్థలు.. గనుల నుంచి రాయి తీయాలన్నా... తీసిన రాయిని పాలీష్ చేసి ఓ రూపం తీసుకురావాలన్నా విద్యుత్ తప్పనిసరి. ప్రస్తుతం విధిస్తున్న విద్యుత్ కోతలతో పనులు సాగక కొన్ని నాపరాయి పరిశ్రమలు మూతపడే స్థితిలోకి వచ్చాయి.
దీంతో వీటిపై ఆధారపడ్డ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రోజుకు సుమారు ఆరుగంటల పాటు విద్యుత్ కోతను విధిస్తున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులే అంటున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా ఎర్రగుంట్లకు పవర్ హాలీడే ఉండకపోవచ్చని అన్నారు. ఎందుకంటే ఇక్కడ గృహాలకు చెందిన విద్యుత్‌ను కూడ సరఫరా చేస్తున్నామని అన్నారు. విద్యుత్ కోతలు విధించి తమపొట్ట కొట్టవద్దని నాపరాయి గనులపై ఆధారపడి బతుకుతున్న వేల మంది కూలీలు కోరుతున్నారు.
ఉపాధికి ఆటంకం ఏర్పడుతుంది...
నాపరాయి పరిశ్రమపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. విద్యుత్ కోతలతో పనులు సక్రమంగా లేవు. వారానికి కనీసం నాలుగు రోజులు పని దొరకాలన్నా కష్టంగా మారింది. విద్యుత్ ఉంటే పనులు ఉంటాయి లేకపోతే పనులు దొరకలన్నా కష్టసాధ్యగా ఉంది
-లోకేష్, కూలీ, శాంతినగర్
ఎడాపెడా కోత..రైతుకు వాత
Published Wed, Mar 5 2014 3:07 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement