ఆదుకున్న మానవత్వం : చిన్నారి చార్మిళకు శస్త్రచికిత్స
Published Sat, Sep 28 2013 6:42 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
చీపురుపల్లి, న్యూస్‌లైన్ : అభం శుభం తెలియని ఆ చిన్నారికి గుండెలో చిల్లులు పడ్డాయి. దగ్గర ఉండి చూసుకోవాల్సిన తండ్రి.. తనతోపాటు తల్లినీ విడిచిపెట్టాడు. ఓ వైపు మూడేళ్ల బిడ్డకు అనారోగ్యం, మరోవైపు భర్త ఎడబాటును ఆ ఇల్లాలు తట్టుకోలేక... తన కష్టాన్ని చెప్పుకునేందుకు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఇక్కడి ఎస్సై ఆమెను దేవుడిలా ఆదుకున్నాడు. చిన్నారి ఎదుర్కొంటున్న కష్టాన్ని తెలుసుకుని పదిమంది దాతల నుంచి విరాళాలు సేకరించి.. శస్త్రచికిత్స చేయించారు. ప్రస్తుతం చిన్నారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదమూ లేకపోవడంతో ఆ కుటుంబం పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన లావేటి లక్ష్మికి నాలుగేళ్ల క్రితం రణస్థలానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి చార్మిళ అనే కుమార్తె ఉంది. ఇటీవల లక్ష్మిని భర్త వదిలిపెట్టాడు. దీంతో ఆమె పుట్టినిల్లు అయిన పట్టణంలోని రిక్షాకాలనీకి వచ్చేసింది. భర్త పెడుతున్న కష్టాలను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సై షేక్ అబ్దుల్‌మరూఫ్ వద్ద వివరించింది. దీంతోపాటు తన కూతురికి గుండెలో చిల్లులు పడ్డాయని, వైద్యులు శస్త్రచికిత్స చేయించాలని చెప్పారని తెలిపింది. కనీసం తమకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేకపోవడంతో శస్త్రచికిత్స చేయించుకోలేకపోతున్నామని, మందులకు కూడా డబ్బులు లేవని చెప్పింది.
తక్షణమే స్పందించిన ఎస్సై మరూఫ్... చిన్నారి మందుల కోసం అక్కడికక్కడే వెయ్యి రూపాయలు ఇచ్చారు. దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీంతో దాదాపు రూ.50 వేల వరకూ సమకూరాయి. స్థానిక తహశీల్దార్‌తో మాట్లాడి వీరికి ధ్రువపత్రం మంజూరు చేయించారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్స జరిగేలా చర్యలు చేపట్టారు. దీంతో ఇటీవల విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చిన్నారి చార్మిళకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం పాప ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు.
Advertisement
Advertisement