రాజధానిలో వంద అడుగుల ఆది శంకరాచార్య విగ్రహం
♦ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వెల్లడి
♦ వేంకటేశ్వరస్వామికి సువర్ణ వక్ష స్థలం బహూకరణ
సాక్షి, గుంటూరు: నూతన రాజధాని అమరావతిలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వంద అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సంకల్పించామని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తెలిపారు. అద్వైత స్థాపనతో హిందూ జాతిని ఏకతాటిపైకి తెచ్చి జాగృతపరిచిన మహనీయుడు ఆదిశంకరాచార్యులు అని కొనియాడారు. ఆదివారం గుంటూరులోని బృందావన్‌గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవ స్థానంలో స్వామివారికి మర్రెడ్డి రామకృష్ణా రెడ్డి, మృదుల దంపతులు శ్రీవత్స చిహ్నాంకిత రత్న ఖచ్చిత సువర్ణ వక్షస్థలాన్ని బహూకరించారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అనంతరం విశేష పూజలు చేశారు. ఆ తర్వాత స్వామివారి చేతుల మీదుగా సువర్ణ వక్షస్థలాన్ని దేవస్థానానికి బహూకరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచి దేవస్థానంలో విష్వక్సేన ఆరాధన పుణ్యవా చన, అజసహస్ర దీపారాధన, రక్షా సూత్రదా రణ, నవగ్రహారాధన, అష్టదిక్పాలక పూజ, వాస్తు మండపారాధన, వాస్తు పర్యాగ్నికర ణ, మహాసుదర్శన హోమం, మçహాసంప్రోక్ష ణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంత రం ఆదిశంకరాచార్య స్వామి జయంతిని పురస్కరించుకుని ఆదిశంకరాచార్య ఆరాధన నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి స్వామివారు అనుగ్రహ భాషణ చేశారు. అనంతరం అన్నదాన ప్రసాదం నిర్వహించారు.