భద్రతా సిబ్బందిపై సీబీఐ విచారణ జరిపించండి
* అన్యమత ప్రచారం చేసే వారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టం అవసరం
* విశాఖ శారద మఠం పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి
తిరుమల: అన్యమత ప్రచార ఘటనల నేపథ్యంలో టీటీడీ భద్రతా సిబ్బందిపై సీబీఐ విచారణ జరిపించాలని విశాఖ శారద మఠం పీఠాధిపతి శ్రీస్వరూపనందేంద్ర సరస్వతి మహాస్వామి డిమాండ్ చేశారు. గురువారం ఉదయం ఆయన స్థానిక శారద మఠంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వానికి హిందూ మతంపై గౌరవం ఉంటే సీబీఐ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓ వ్యక్తి తన బృందంతో స్వేచ్ఛగా మతప్రచారం చేయడం వెనుక భద్రతా సిబ్బంది సహకారం ఉందనే సందేహాన్ని ఆయన వ్యక్తం చే శారు.
ఆ ఘటన జరిగిన వెంటనే టీటీడీ ఈవో, జేఈవో స్పందించి అన్యమత ప్రచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయించడంతో పాటు టీటీడీ సిబ్బందితో ప్రమాణం చేయించడం గొప్ప విషయమన్నారు. ఇదే తరహాలో దేవాదాయ శాఖలో కూడా చేయించాలన్నారు. హిందూ ఆల యాల వద్ద అన్యమత ప్రచారం చేసే వారిని శిక్షించేందుకు నిర్భయ చట్టం తరహాలో ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. టీటీడీ చేతగానితనం వల్లే పీఠాధిపతులు, మఠాధిపతుల సమావేశాలు జరగడం లేదన్నారు.
త్వరలో ఆగమ సలహామండలితో సమావేశమై ఆలయంలో జరగాల్సిన కార్యక్రమాలు జరిగే సమయం, పద్ధతులపై చర్చిస్తామన్నారు. స్వామికి విశ్రాంతి లేకుండా దర్శనాలకోసమే ఎక్కవ సమయాన్ని కేటాయించడం సరికాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. శ్రీవారికి వచ్చిన ఆదాయం హిందూ మత ప్రచారానికే వినియోగించాలన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని దర్శించు కున్నారు.