వంద గ్రామాలకు కరెంట్ కట్
- 14 సబ్‌స్టేషన్ల పరిధిలో అంధకారం
- వర్షం మిగిల్చిన నష్టం రూ.14.43 కోట్లు
హన్మకొండ, న్యూస్‌లైన్: జిల్లాలో కురిసిన అకాల వర్షంతో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తమైంది. 14 సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాలన్నీ బుధవారం రాత్రి వరకూ అంధకారంలోనే మగ్గుతున్నాయి. మొత్తం 28 సబ్‌స్టేషన్లు వర్షం తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా చేసే డీటీఆర్‌లు వర్షం నీటితో కాలిపోయాయి. ప్రధాన లైన్లల్లో కండక్టర్ వైరు ఎక్కడికక్కడే తెగిపోయింది. దీంతో సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖకు మొత్తం రూ.14.43 కోట్ల నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల పునరుద్ధరణ కోసం రూ.8 కోట్లు అవసరమని ప్రాథమికంగా గుర్తించారు.
పర్వతగిరి మండలం ఏనుగల్లు తండా వద్ద ట్రాన్స్‌కో నుంచి వచ్చే 222 కేవీ లైను తెగిపోయింది. దీం తో కొన్ని గంటల పాటు జిల్లాకు సరఫరా ఆగిపోయింది. అధికారులు ప్రత్యామ్నాయంగా మరో ఫీడర్‌పై సరఫరాను పునరుద్ధరించారు. బుధవారం రాత్రి వరకు 14 సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. కానీ... మరో 14 సబ్‌స్టే షన్ల పరిధిలో మరమ్మతులు ముందుకు సాగడం లేదు. తీగరాజుపల్లి, సంగెం, చౌటపల్లి, ఏనుగల్లు, పర్వతగిరి, ద్వారకపేట, కూనూర్, వెంకటాపూర్, రెడ్లవాడ, అలంకానిపేట, లింగగిరి, ఉప్పరపల్లి, గూడూర్, నెక్కొండ సబ్‌స్టేషన్లలో బుధవారం రా త్రి వరకూ మరమ్మతులు పూర్తి కాలేదు. రాత్రి కావడంతో వి ద్యుత్ పనులు నిలిపివేశారు. దీంతో ఈ సబ్‌స్టేషన్ల పరిధిలో సుమారు 100కుపైగా గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి.
నేలకూలిన స్తంభాలు
జిల్లాలో ప్రధాన లైన్ ఈసారి దెబ్బతిన్నది. 11.2 కిలోమీటర్ల కండక్టర్ వైరు తెగిపోయింది. సబ్‌స్టేషన్ల నుంచి ట్రాన్స్‌ఫార్మర్లకు విద్యుత్ సరఫరా చేసే ఈ లైను తెగిపోవడంతో సరఫరా పునరుద్ధరణ కష్టంగా మారింది. అదే విధంగా 28 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. వీటిలో అత్యవసరంగా 9 డీటీఆర్ (ట్రాన్స్‌ఫార్మర్ల)ను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశారు. 11కేవీ లైన్ల పరిధిలో 44 పెద్ద విద్యుత్ స్తంభాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వీటి పునరుద్ధరణకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇక జిల్లాలో విద్యుత్ సరఫరా చేసే ఎల్‌టీ లైన్ల పరిధిలో 1059 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వీటి స్థానంలో కొత్త స్తంభాలు వేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్తంభాలు అనుకున్న సమయంలో రాకపోవడంతో లైన్లు కూడా పునరుద్ధరించడం లేదు. 11కేవీ స్తంభాలతో రూ.88 వేలు, ఎల్‌టీ లైన్ల పరిధిలో 1059 స్తంభాలు నేలకూలడంతో రూ.16.94 లక్షలు, 28 సబ్‌స్టేషన్లు తీవ్రంగా దెబ్బతినడంతో రూ.14 కోట్లు, 28 డీటీఆర్ ట్రాన్స్‌పార్మర్లు కాలిపోవడంతో రూ.13.50 లక్షలు, 11.2 కిలోమీటర్ల కండక్టర్ వైరు తెగిపోవడంతో రూ.11 లక్షల నష్టం వాటిలినట్లుగా అంచనా వేశారు.