= దారి మళ్లింపుతో గంటల కొద్దీ ఆలస్యం
= సరైన సమాచారం తెలియక ప్రయాణికుల ఇక్కట్లు
= మరో రెండురోజుల వరకు ఇదే పరిస్థితి?
విజయవాడ, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను కోస్తా ప్రాంతంలో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. తుపాను ప్రభావంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్లే అన్ని సర్వీసులను నిలిపివేశారు. హౌరా-అసోం నుంచి వచ్చే రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం రావలసిన పలు రైళ్లు బలార్ష మీదుగా వస్తుండటంతో అవి నగరానికి అర్ధరాత్రి చేరుకునే అవకాశముంది.
ఈ రైళ్లే గమ్యస్థానం నుంచి మరలా రావలసి ఉంది. దీంతో సోమ, మంగళవారాల్లో రావాల్సిన రైళ్లు వస్తాయా? లేదా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు రైళ్లను నడుపుతున్నా అవి ఎంత ఆలస్యంగా నడుస్తాయో చెప్పలేకపోతున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, పలాస, భువనేశ్వర్ మీదుగా హౌరా వెళ్లే రైళ్లను కాజీపేట, వరంగల్, బలార్ష, రాయ్‌పూర్ మీదుగా హౌరాకు మళ్లించినట్లయితే 560 కిలోమీటర్లు అధికంగా ప్రయాణించవలసి ఉంటుంది.
ఈ నేపథ్యంలో దారి మళ్లించిన అన్ని రైళ్లు 12 నుంచి 15 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రైల్వే ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ ఆహారం, మంచినీరు, పాలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో దెబ్బతిన్న రైల్వేట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టారు. దీంతో సోమవారం నుంచి అటువైపు రైళ్ల రాకపోకలు యథావిధిగా జరిగే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పలు రైళ్లను దారి మళ్లించడం, మరికొన్నింటిని రద్దు చేయడం, ఇంకొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో వాటి వివరాలను ప్రయాణికులకు అందించడం సమాచార కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. ఉదయం రావలసిన రైళ్లు రాత్రికి, రాత్రికి రావలసిన రైళ్లు మరుసటి రోజు మధ్యాహ్నానికి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ రైలు ఎప్పుడు వస్తుందో.. అది ఎంత వరకు వెళ్తుందో తెలియక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
ముంబై - భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ - భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను విశాఖపట్నం వరకే నడిపారు. హౌరా నుంచి వాస్కోడిగామా వెళ్లాల్సిన అమరావతి ఎక్స్‌ప్రెస్ ఆదివారం రద్దయ్యింది. ఆదివారం ఉదయం విజయవాడకు చేరుకోవలసిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ అర్ధరాత్రి దాటిన తర్వాత రావచ్చునని తెలుస్తోంది. ఈ విధంగా దారి మళ్లించిన అన్ని రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో వారు టికెట్లను రద్దు చేసుకుంటే తిరిగి నగదు చెల్లించడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీనికితోడు వారు వెళ్లవలసిన రైలులో కాకుండా వేరొక రైలులో ప్రయాణించేందుకు కూడా అధికారులు అనుమతించారు. రానున్న రెండు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని నివారించడానికి కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు ఆదివారం రెండు ప్రత్యేక రైళ్లను నడిపారు. మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ఇంకొక రైలును నడిపారు. దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.