ప్రతీకాత్మక చిత్రం
బిజీ లైఫ్ కొందరి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. అనేక కారణాలతో ఒత్తిడికి గురై భార్యాభర్తల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. ఇవి విడాకుల కోసం కోర్టు మెట్ల వరకు తీసుకెళ్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, ఆర్థిక స్వాతంత్య్రం రావడం, భేషజాలు పెరిగిపోతుండటంతో ‘కొంప’ మునిగే పరిస్థితులు దాపురిస్తున్నాయి.
లబ్బీపేట (విజయవాడ తూర్పు) :గుణదలకు చెందిన వెంకటేష్, శ్రీసుధ భార్యభర్తలు. మహేష్ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. శ్రీసుధ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. ఇద్దరూ కలిపి నెలకు రూ.40 వేలు సంపాదించుకుంటున్నారు. ఉద్యోగరీత్యా షిప్ట్ డ్యూటీలతో ఇద్దరూ ఇంట్లో కలిసి ఉండేది చాలా తక్కువే. ఇటీవల కాలంలో వారు తీవ్ర అసహనానికి, వత్తిడికి గురవుతున్నారు. దీంతో చిన్న విషయాలకే వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంపత్య జీవనంపై తీవ్ర ప్రభావం చూపడంతో ఇటీవల ఇద్దరూ కలిసి మానసిక వైద్యుడిని సంప్రదించారు.
గాంధీనగర్‌కు చెందిన యువకుడు ఎంబీఏ చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాది కిందట పెళ్లయింది. వారు ఉండే అపార్ట్‌మెంట్ పక్క ఫ్లాట్ వాళ్లు కారులో తిరగడంతో, తాము కూడా కారు కొనాలని తరచూ భార్య అడగడం ప్రారంభించింది. ఇలా ప్రతిదీ ఇతరులతో పోల్చుకుంటూ ఉండటంతో ఇద్దరి మధ్య పొరపొచ్ఛాలు తలెత్తాయి. ఫలితంగా విడాకులు కోరే పరిస్థితి దాపురించింది.
..కాలంతో పాటు పరిగెడుతున్న సిటీ లైఫ్‌లో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. సిటీలో మధ్య తరగతి వర్గాలు జీవనం సాగించాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. దంపతులిద్దరూ ఉద్యోగులు కావడం, విధి నిర్వహణలో ఒత్తిడితో చికాకు, కోపం పెరగడం దాంపత్య జీవనంలో భేదాభిప్రాయాలు వస్తున్నాయి. మరో వైపు సెల్‌ఫోన్, కంప్యూటర్‌లు కూడా భార్యాభర్తల మధ్య వివాదాలకు తెర లేపుతున్నాయి. భర్త తనతో కన్నా కంప్యూటర్, సెల్‌ఫోన్‌తోనే ఎక్కువ గడుపుతున్నాడని, ఎవరెవరితోనే ఫోన్‌లో మాట్లాడుతున్నాంటూ ఐదు నెలల కిందట పెళ్లైన ఓ యువతి విడాకులకు పిటిషన్ దాఖలు చేసిదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. నూతన దంపతుల్లో లైంగిక సమస్యలు తలెత్తుతుండగా, భార్యాభర్తల మధ్య పంతాలు (ఇగోస్), వ్యక్తిత్వ వికాస లోపం కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి.
అంతరించిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
ఒకప్పుడు ఇళ్లలో అమ్మమ్మ, బామ్మలు, తాతయ్యలు ఉంటే వారే ఇలాంటి సమస్యలను పరిష్కరించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. భార్యాభర్తల మధ్య తలెత్తుతున్న చిన్నపాటి విభేదాలు పోలీసు కేసుల వరకూ దారి తీస్తున్నాయి. అక్కడ వరకూ వెళ్లిన తర్వాత కానీ తమ తప్పును తెలుసుకుని మనస్థాపం చెందుతూ కౌన్సిలర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే నగరంలో భార్యాభర్తల మధ్య సర్ధుబాటు సమస్యలతో మానసిక వైద్యుల వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. నెలలో నగరంలోని మానసిక వైద్యులు, కౌన్సిలర్స్‌ను ఇలాంటి సమస్యలతో వంద మందికిపైగా ఆశ్రయిస్తున్నట్లు చెపుతున్నారు.
ఆత్మీయ అనుబంధాలు దెబ్బ తింటున్నాయి
ప్రస్తుతం యంగేజ్ దంపతుల్లో ఆత్మీయ అనుబంధాలు దెబ్బ తింటున్నాయి. పెళ్‌లైన ఆరేడు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తమ జీవితాలను ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువైంది. డబ్బు సంపాదనపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఇతర ఆకర్షణలతో దాంపత్య జీవనం దెబ్బ తింటోంది. భార్యాభర్తల మధ్య సెక్స్ రిలేషన్స్ సవ్యంగా ఉంటే ఇగోలు పోవడంతో పాటు, ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గుతుంది. ప్రస్తుతం బిజీ లైఫ్‌లో దాంపత్య జీవనం సరిగా లేకపోవడంతో భార్యాభర్తల మధ్య వివాదాలు. అపోహలకు తావిస్తుంది.– డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి,మానసిక వైద్య నిపుణులు
కౌన్సెలింగ్‌తోసమస్యలు పరిష్కారం
భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలకు కౌన్సెలింగ్‌తో పరిష్కారం లభిస్తుంది. ముందుగా ఇద్దరి మధ్య ఇగోలు ఉండకూడదు. ఇద్దరూ సమానం అనే భావన ఉన్నప్పుడు దాంపత్య జీవనం సవ్యంగా ముందుకు సాగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనపరులైన వారిలోనే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. అందుకు సర్ధుబాటు కారణంగా చెప్పవచ్చు. ఉమ్మడి కుటుంబాలు అంతరించి పోవడంతో తప్పొప్పులను చెప్పే వారే లేక కౌన్సిలర్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో భార్యార్యభర్తల మధ్య వివాదాలు పెరిగాయి.– గర్రే శంకర్రావు,కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment