సుమారు 12 ఏళ్ల క్రితం వారిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కులాలు వేరైనా మనసులు కలిసి మనువాడిన వారిద్దరూ ఒక్కటిగా ఉంటే చాలు అనుకున్న ఇరువైపుల కుటుంబాలు
శృంగవరపుకోట: సుమారు 12 ఏళ్ల క్రితం వారిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కులాలు వేరైనా మనసులు కలిసి మనువాడిన వారిద్దరూ ఒక్కటిగా ఉంటే చాలు అనుకున్న ఇరువైపుల కుటుంబాలు ఆనందించి వారి వివాహబంధాన్ని ఆనందించి ఆమోదించారు. ఆ దంపతులిద్దరూ ఇంతవరకూ అన్యోన్యంగా కాపురం చేశారు. వారి అన్యోన్యానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. అంతలో ఏమైందో? వారి కాపురంలో కలహాలు చోటు చేసుకున్నాయి. భార్యతో గొడవపడ్డ భర్త మద్యం మత్తులో ఆమెపై దాడికి తెగబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్.కోట మండలం సంతగవిరమ్మపేట గ్రామానికి చెందిన సన్యాసమ్మ..విజయనగరానికి చెందిన మజ్జి శ్రీనివాసరావును ప్రేమించి పెళ్లాడింది. వీరికి లోకేష్, అఖిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్.కోట పట్టణంలోని శ్రీనివాసకాలనీలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయం ఎదుట నివాసముంటున్న ఎం.సన్యాసమ్మ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో మజ్జి శ్రీనివాసరావు భార్యతో గొడవపడి ఎక్సర్‌సైజులు చేసే డంబెల్స్‌తో ఆమె తలపై బలంగా మోదాడు. దాంతో ఆమె తల ఎడమవైపు బలమైన గాయం అయ్యింది. ఈ గొడవతో ఉలిక్కిపడిన ఇరుగుపొరుగు వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
సన్యాసమ్మ భర్త ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భార్యపై దాడి చేశానని చెప్పి లొంగిపోయాడు. ఎస్సై సాగర్‌బాబు హుటాహుటిన శ్రీనివాసకాలనీకి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న సన్యాసమ్మను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి డాక్టర్ శ్యామల ప్రాథమిక చికిత్స చేసి విశాఖకు తరలించాలని సూచించారు. జరిగిన సంఘటనపై ఎస్సై మాట్లాడుతూ శ్రీనివాసరావు డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, బాధ్యతారహితంగా తిరుగుతాడని, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. ఆ దంపతులను గతంలో ఒకసారి స్టేషన్‌కు పిలిచి మందలించామని చెప్పారు. పూర్తి వివరాలు బాధితురాలి నుంచి సేకరించాల్సి ఉందన్నారు.