బతుకు బరువైందా..?
♦ చినమురపాకలో ఉరి వేసుకొని భార్యాభర్తల ఆత్మహత్య
♦ మనస్పర్థలే కారణమా? – మృతురాలు విజయనగరం జిల్లా వాసి
♦ దంపతుల మృతిపై గోప్యత పాటించిన బంధువులు, గ్రామస్తులు
♦ దహన సంస్కారాలను మధ్యలో ఆపి మృతదేహాలను తీసుకెళ్లిన పోలీసులు
♦ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన కుమారుడు
లావేరు(శ్రీకాకుళం): మండలంలోని చినమురపాక గ్రామంలో ఆదివారం ఉదయం భార్యాభర్తలు అంపోలు శ్రీనివాసరావు(39), హైమావతి(33)లు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరి మధ్యా ఉన్న మనస్పర్థలే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని బంధువులు, గ్రామస్తులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. భార్యాభర్తల ఆత్మహత్య విషయాన్ని కూడా వారు చాలా గోప్యంగా ఉంచారు. పోలీసులకు కూడా తెలియకుండా హడావుడిగా రెండు మృతదేహాలను దహనం చేయడానికి ప్రయత్నించారు. ఆఖరకు విషయం పోలీసులకు తెలియడంతో వారు ఫైర్ ఇంజిన్‌తో శ్మశాన వాటికకు వెళ్లి, దహన సంస్కారాలను మధ్యలోనే ఆపి, సగం కాలిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
మనస్పర్థలే కారణమా..?
చినమురపాక గ్రామానికి చెందిన అంపోలు శ్రీనుకు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన హైమావతిలకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. కొన్నేళ్ల వరకు వారి కాపురం సజావుగానే సాగినా ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. ఇటీవల అవి చాలా ఎక్కువయ్యాయి. ఓసారి లావేరు పోలీస్‌స్టేషన్‌లో వీరిద్దరికీ కౌన్సిలింగ్ కూడా చేసినట్లు సమాచారం. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో భార్యభర్తలు ఇంటి వద్దనే ఉన్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు గానీ భర్త శ్రీను ఇంటిలోని ఒక గదిలోను, భార్య హైమావతి వేరొక గదిలోనూ శ్లాబ్‌కు ఉన్న ఐరన్ హుక్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఇంటికి విద్యుత్ బిల్లులు తీయడానికి ఒక వ్యక్తి రావడంతో ఆ దంపతుల కుమారుడు శశి వచ్చి ఇంటి తలుపులు తీశాడు. అప్పటికే ఇద్దరూ ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించిన ఆ వ్యక్తి బయటకు వచ్చి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. ఇద్దరినీ కిందకు దించి చూడగా అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు.
పోలీసులకు చెప్పకుండా..
భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయాన్ని పోలీసులకు కూడా తెలియజేయకుండా వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గోప్యత పాటించి, హడావుడిగా రెండు మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకువెళ్లి దహనం చేయడానికి ప్రయత్నించారు. విషయం లావేరు పోలీసులకు తెలియడంతో లావేరు ఎస్‌ఐ రామారావు, హెచ్‌సీ శ్రీనివాసరావులు తన సిబ్బందితో కలిసి చినమురపాక గ్రామానికి వెళ్లి, ఫైర్ ఇంజిన్‌ను తెప్పించి దహన సంస్కారాలను ఆపివేయించారు. సగం కాలిన మృతదేహాలను బయటకు తీయించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతుడు శ్రీను కుటుంబ సభ్యులు, మృతురాలు హైమావతి కుటుంబ సభ్యులు ఒక అవగాహనకు రావడం వల్లనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయకుండా గోప్యత పాటించినట్లు సమాచారం.
తల్లిదండ్రులను కోల్పోయి..
ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన భార్యాభర్తలకు శశి అనే ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. చినమురపాక గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో శశి 3వ తరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే శశి తల్లిదండ్రులును కోల్పోయి అనాథగా మిగిలాడు. బాలుడి పరిస్థితిని చూసి స్థానికులంతా కంట తడి పెట్టారు. మృతుడు శ్రీను వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కాగా హైమావతి కూడా ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తె. వీరి మృతితో ఇరుకుటుంబాల వారు గుండెలవిసేలా రోదించారు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.