ప్రేమ..పెళ్లి...మోసం | husband cheated by his wife | Sakshi
Sakshi News home page

ప్రేమ..పెళ్లి...మోసం

Published Mon, Mar 27 2017 1:41 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

husband cheated by his wife

► న్యాయం కోసం భర్త ఇంటి ముందు బిడ్డతో భార్య బైఠాయింపు
► మరో మహిళను వివాహమాడిన భర్త

ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకొని ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తనను మోసం చేసి మరో మహిళను వివాహం చేసుకొన్న తన భర్త నుంచి నాకు న్యాయం చేయాలని కోరుతూ ఓ భార్య భర్త ఇంటి ముందే బైఠాయించింది. గట్టిగా ప్రశ్నిస్తే నలుగురిలో నా పరువు తీయొద్దని..వేరో చోట మాట్లాడదామని రమ్మని మోసం చేస్తున్నాడంటూ తన బిడ్డ సంరక్షణ విషయంలో న్యాయం చేయాలని కోరింది. వివరాల్లోకి వెళ్తే...

సాలూరు: తనను ప్రేమ వివాహం చేసుకుని, ఆడబిడ్డకు తండ్రైన ఎనిమిదేళ్ల తర్వాత మోసం చేస్తున్నాడంటూ స్థానిక కొంకివీధిలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలోని ఓ మహిళ తన బిడ్డతో భర్త ఇంటి ముందు ఆదివారం బైఠాయించి న్యాయం చేయాలంటోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో టీచర్‌ ఫాతిమా ఇంటి వద్దకు చేరుకున్న బొబ్బ విజయ, తన కుమార్తె సనోబర్‌ సలమాతో కలసి బైఠాయించింది. దీంతో ఇరుగుపొరుగు మహిళలు ఆరా తీయగా తనకు జరిగిన అన్యాయాన్ని విజయ వివరించింది.

భర్త  మహమ్మద్‌ షీరాజ్‌తో కలసి వున్న ఫోటోలను, వారి బిడ్డ జనన ధ్రువీకరణ పత్రం చూపుతూ, టీచర్‌ను వివాహమాడి, తనను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాడో చూడండంటూ వివరించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం 2007లో రామభద్రపురంలో తాను తొలి భర్తకు విడాకులిచ్చి జీవిస్తుండగా ద్విచక్ర వాహనాల కన్సల్టెంట్‌గా పని చేస్తోన్న షిరాజ్‌తో పరిచయమైంది. పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్న అనంతరం 2008లో విశాఖలో కుమార్తె సనోబర్‌ సలమా జన్మించిందని తెలిపింది.

రెండేళ్ల కిందట మరలా రామభద్రపురం తీసుకువచ్చి అద్దె ఇంటిలో పెట్టాడని,  సాలూరులో ప్రభుత్వ టీచర్‌ను పెళ్లాడారని, వారికి ఒక మగ బిడ్డ కూడా వున్నట్టు తెలిసిందని వాపోయింది. తమ పోషణను పట్టించుకోకపోగా  ఇంటి అద్దెను కూడా చెల్లించడం లేదని గొల్లుమంది. ఇదేమని ప్రశ్నిస్తే వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా, తనకు సంబంధం లేదని చెబుతున్నాడని వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందన లేకపోవడంతో అతను కాపురముంటోన్న ఇంటి వద్ద తన బిడ్డను వదిలి వెళ్లేందుకు వచ్చానని తెలిపింది. అయితే షిరాజ్‌ తనతో ఫోన్‌లో మాట్లాడుతూ ఇంటివద్ద తన పరువు తీయొద్దని, మెయిన్‌రోడ్డుకు రావాలని కోరుతున్నాడని వాపోయింది.

తన బిడ్డకు న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై షిరాజ్‌ను వివరణ కోరేందుకు విలేకరులు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఇదిలా ఉండగా విజయ బైఠాయించిన ఇంటికి సంబంధించిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను స్టేషన్‌కు పిలిపించారు. ఇదే విషయమై టౌన్‌ ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ వద్ద సాక్షి ప్రస్తావించగా ఇరు వర్గాల వారిని పిలిపించామని విచారణ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement