
చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు...
విజయవాడ : విజయవాడ వాంబే కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్డుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. వివరాల్లోకి వేళ్తే విజయవాడలోని వాంబేకాలనీలో నివాసం వుంటున్న దుర్గా ప్రసాద్‌కు, పదేళ్ళ కిందట ఇదే ప్రాంతంకు చెందిన మరియమ్మ అలియాస్ బుజ్జితో పదేళ్ళ కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా వున్నారు. అయితే కొంతకాలంగా మరియమ్మ మరో వ్యక్తితో సన్నిహితంగా వుంటోంది.
దీనిపై భార్యాభర్తల మధ్య తరచుగా ఘర్షణలు జరిగేవని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నెలరోజుల కిందట మరియమ్మను ఇదే విషయంలో నిలదీయడంతో ఇరువురి మధ్య తిరిగి వివాదం జరిగింది. ఆగ్రహంతో మరియమ్మను హతమార్చిన దుర్గాప్రసాద్ తరువాత తాను వుండే అపార్ట్‌మెంట్ల మధ్యలోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. డ్రైనేజీ పనులకోసం గొయ్యి తీసినట్లు చుట్టుపక్కల వారిని నమ్మించాడు. తరువాత తన భార్య ఎటో వెళ్ళిపోయిందని అందరికీ చెప్పి నమ్మించాడు. నెలరోజులు గడిచినా తమ కుమార్తె జాడ తెలియకపోవడంతో మరియమ్మ తల్లిదండ్రులు సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనితో దుర్గాప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగు చూసింది. సిఐ సహేరాబేగం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని వెలికితీశారు.