మిర్యాలగూడ, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ హౌసింగ్‌బోర్టు కాలనీలో ఓ భర్త భార్యను చంపి, శవాన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్లాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కర్నె చంద్రయ్య, నాగమ్మ(45) దంపతులు 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడకు వచ్చారు. హౌసింగ్‌బోర్టు కాలనీలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం చేస్తున్నారు. చంద్రయ్య తాగుడుకు బానిస కావడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి తాగిన మైకంలో చంద్రయ్య భార్య తలపై రోకలితో కొట్టి చంపాడు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఇంటికి తాళం వేశాడు.
అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా మద్యం తాగుతూ కాలనీలోనూ తిరుగుతూ బయటే పడుకుంటున్నాడు. దుర్వాసన వస్తుండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, నాగమ్మ మృతదేహం కనిపించింది. కాలనీలోనే తిరుగుతున్న చంద్రయ్యను పట్టుకొని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. కేసు దర్యాప్తులో ఉంది.