కాపులకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై ఏపీ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు వన్నంపూల నారాయణస్వామి నిప్పులు చెరిగారు.
హైదరాబాద్: కాపులకు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై ఏపీ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు వన్నంపూల నారాయణస్వామి నిప్పులు చెరిగారు. నారాయణస్వామి రాయల్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు జిల్లాల కాపు నాయకులు గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. కాపులకు ఇచ్చిన హామీ పట్ల చంద్రబాబు వ్వవహరిస్తున్న ఉదాసీన వైఖరి సరికాదన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటుతున్నా బీసీ కమిషన్ నియామకంగాని, బీసీల్లో చేర్చేందుకు అవసరమైన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ సర్వేకుగాను రూ. కోటి కేటాయించకుండా కాపుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరి వల్ల అధికారంలోకి వచ్చామో చంద్రబాబు గుర్తెరగాలన్నారు. హామీ మేరకు కాపులకు బీసీ రిజర్వేషన్ అందించాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. హామీలపై సీఎం చంద్రబాబును కలవనున్నట్టు చెప్పారు.