హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్ :చంద్రబాబు
విశాఖ : మహానాడు సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్ తన సృష్టేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ తన బ్రెయిన్ చైల్డ్ అని, భాగ్యనగరి తన ఘనతే అని గొప్పలు చెప్పారు. మహానాడు ముగింపు సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ‘ రెండు రాష్ట్రాల్లో టీడీపీ శాశ్వతంగా ఉండాలి. మహానాడులో 34 తీర్మానాలను ఆమోదించాం. గతంలో ఎన్నుడూ లేనివిధంగా మహానాడు జరిగింది. టీడీపీకి 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఉక్కు పరిశ్రమ కోసం విశాఖ వాసులు ఎంతగానో పోరాడారు.
విశాఖను నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దుతాం. గోదావరి నీటిని విశాఖకు తీసుకొస్తాం. ముఠా రాజకీయాలు, హత్యా రాజకీయాలకు టీడీపీ వ్యతిరేకం. తెలుగువారు ఎక్కడున్నా అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. టీడీపీని దెబ్బ తీసేందుకే విభజన వాదాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చింది. రాష్ట్ర విభజనతో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తున్నాం. రైతు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాదే పూర్తి చేస్తాం. పోలవరానికి కావాల్సిన నిధులన్నీ నాబార్డ్ ద్వారా ఇస్తామని కేంద్రం చెప్పింది. 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం.
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతే మొత్తంలో ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించాం. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా 33వేల ఎకరాలు సేకరించాం. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ రావాలని అడిగాం, తప్పకుండా తెస్తాం. వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాలి. పొత్తు పెట్టుకున్న తర్వాత ఒకరినొకరు విమర్శించుకోవడం మంచిది కాదు. బీజేపీ నేతలు విమర్శించినా టీడీపీ నేతలు విమర్శించొద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి కోలుకునే పరిస్థితి లేదు. వైఎస్‌ఆర్ సీపీకి దేనిపైనా స్పష్టత లేదు. అనుభవం లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతంరం శ్రమిస్తా. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ టీడీపీనే’ అన్నారు.