'దివ్యది ముమ్మాటికీ హత్యే' | Hyderabadi medico Divya suspicious death in Mumbai | Sakshi
Sakshi News home page

'దివ్యది ముమ్మాటికీ హత్యే'

Published Mon, Jan 6 2014 2:01 PM | Last Updated on Tue, Oct 9 2018 7:18 PM

'దివ్యది ముమ్మాటికీ హత్యే' - Sakshi

'దివ్యది ముమ్మాటికీ హత్యే'

హైదరాబాద్: ముంబై జస్లోక్ ఆస్పత్రిలో అనుమానాస్పదస్థితిలో మరణించిన వైద్య విద్యార్థిని దివ్య భౌతికకాయం ఆదివారం మధ్యాహ్నం అడిక్‌మెట్‌లోని ఆమె నివాసానికి చేరుకుంది. అప్పటికే అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకున్న స్నేహితులు, బంధువులు దివ్య మృతదేహాన్ని చూడగానే బోరుమన్నారు.  దివ్యది ముమ్మాటికీ హత్యేనని వారంతా అన్నారు.  ఎంతో కష్టపడి పీజీ ఎంట్రెన్స్ రాసి తనకిష్టమైన చదువు చదువుతున్న ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని బంధువులు పేర్కొన్నారు. 

తల్లితో రోజూ ఫోన్‌లో మాట్లాడే దివ్య ఏనాడూ తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదనిగానీ, ఇబ్బందులు పడుతున్నట్టు గాని చెప్పలేదని వారు తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం  దివ్య మృతిపై తల్లిదండ్రులకు మొదట చెప్పిన దానికి, తర్వాత చెప్పిన దానికి పొంతనలేకుండా ఉందని ఆరోపించారు.  మత్తు మందు ఆమె గదికి తెచ్చుకోవాలంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ అనుమతి ఉండాలని, అసలు ఆమె చేతిలోకి ఆ మందు ఎలా వచ్చిందో చెప్పడంలేదన్నారు.

ఎవరో బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దివ్య మృతి మిస్టరీని ఛేదించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బంధువులు డిమాండ్ చేశారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ఎంఎన్ శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ సి.సునీత దంపతులు దివ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం అంబర్‌పేట శ్మశాన వాటికలో బంధువుల కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
 
వెళ్లి పోయావా చదువుల తల్లీ...!
కేజీ నుంచి పీజీ వరకు దివ్య ఎప్పుడూ ఫస్ట్ క్లాసు స్టూడెంట్. ఆమె తెలివి తేటలకు ఉపాధ్యాయులు అబ్బురపడేవారు. తల్లి రుక్మిణి పని చేస్తున్న మదర్స్ ఇంటిగ్రిల్ స్కూల్‌లోనే దివ్య ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిస్టింక్షన్‌లో పాసై ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సంపాదించి మెడిసిన్ కోర్సులో చేరింది. మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ కళాశాలలో చదువుకొని గోల్డ్ మెడల్ సాధించింది.

తల్లి ఓ పక్క స్కూల్‌లో పని చేస్తూ.. మరో విద్యార్థులకు ట్యూషన్లు చెప్తూ తన ఒక్కగానొక్క కూతురు దివ్యను చదివించింది. ఆలిండియా స్థాయిలో ఓపెన్ కేటగిరిలో మొదటి సారి పీజీ సీటు కోసం ఎంట్రెన్స్ రాస్తే రాలేదు. దీంతో ఆంధ్ర మహిళా ఆస్పత్రిలో ఆర్‌ఎంఓగా పనిచేస్తూనే మరో వైపు పీజీ ఎంట్రెన్స్ కోసం అహర్నిశలు శ్రమించింది. మధ్యలో ఖాళీగా ఉండకుండా బీహెచ్‌ఈఎల్‌లో నెలకు రూ. 60 వేల జీతానికి ఉద్యోగంలో చేరింది. ఇంతలోనే పీజీ ఎంట్రెన్స్‌లో ఫ్రీ సీటు రావడంతో ఉద్యోగం మానేసి ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో చేరింది.

తండ్రి శ్రీనివాస్ కొబ్బరి కాయలు అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకురావడం, ప్రైవేటు టీచర్‌గా పని చేసే తల్లి తన కోసం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి చదివించడం దివ్యపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. తల్లిదండ్రులు కలలను నెరవేర్చాలని చాలా కష్టపడి చదివి... రూ. కోట్లు వెచ్చిస్తే గాని రాని సీటును ఫ్రీ సీటుగా పొందింది.  ఇక చదువుల ఫలాలను ఆస్వాదించే సమయంలో తల్లిదండ్రుల కలలను కల్లలు చేస్తూ అనుమానాస్పదస్థితిలో మృతి చెంది వారికి తీరని శోకాన్ని మిగిల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement