సాక్షి, పాములపాడు(కర్నూలు) : వేంపెంటకు నవ వసంతం వచ్చింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. గ్రామంలోని నిప్పుల వాగుపై ర్యాంక్ మినీ హైడ్రాలిక్ పవర్‌ప్లాంటు నిర్మాణం రద్దయ్యింది. నూతన ప్రభుత్వం చొరవ తీసుకుని పవర్‌ప్లాంటును రద్దు చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా వారు చేస్తున్న నిరాహార దీక్షలను శుక్రవారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ పవర్‌ప్లాంటును రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శుక్రవారం గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు.
ప్లాంట్ రద్దు చేస్తున్నట్లు జీఓ పత్రం ఇవ్వాలని దీక్షలో కూర్చున్న మహిళలు కోరారు. కలెక్టర్ స్పందిస్తూ సీఎం స్థాయిలో చెప్పిన విషయాన్ని వెంటనే అమలు చేస్తామని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జీఓ ఇస్తామని తెలిపారు. దీంతో వారు దీక్షల విరమణకు అంగీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేంపెంట వాసుల సుదీర్ఘ పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ మాట్లాడుతూ పవర్‌ప్లాంటు రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడడంతో గ్రామస్తుల మోములో చిరునవ్వు చూస్తున్నానన్నారు. గ్రామ శ్రేయస్సు కోసం చేసిన పోరాటం వృథా కాలేదన్నారు. అలాగే జగనన్న ఇచ్చిన మాటను నిలుపుకున్నారన్నారు. ఆయన మాటే జీఓ అన్నారు. ప్రజలు ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తాను ప్రతి సంక్షేమ పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని తెలిపారు. గ్రామంలో శ్మశాన వాటిక, రహదారి, గతంలో పవర్‌ప్లాంటు కోసం నిర్వహించిన బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులు, 1,567 రోజులుగా దీక్షలో కూర్చున్న వారికి ఆర్థిక సహకారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
హర్షం వ్యక్తం చేసిన వేంపెంట వాసులు
పవర్‌ప్లాంటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో వేంపెంట గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, స్థానిక ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌కు, సహకరించిన ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బహదూర్, సామేలు, డాక్టర్ శరత్, ఆనందరావు, శ్రీనివాసులు మాట్లాడుతూ పవర్‌ప్లాంటు నిర్వాహకులు మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇన్నాళ్లూ అధికారులు సైతం వారికి వత్తాసు పలికారన్నారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకంతోనే గాంధేయ మార్గంలో పోరాటం కొనసాగించామన్నారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న కష్టాలు, మానసిక వేదన గురించి వివరించారు.
కలెక్టర్, ఎమ్మెల్యేకు సత్కారం
కలెక్టర్, ఎమ్మెల్యేను గ్రామస్తులు దుశ్శాలువా, పూల మాలలతో సత్కరించారు. గ్రామ శ్రేయస్సు కోసం పోరాటంలో పాలుపంచుకున్న టీడీపీ నాయకుడు రామన్నగౌడును కూడా సత్కరించారు. అలాగే కలెక్టర్, ఎమ్మెల్యే దీక్షలో కూర్చున్న సామ్రాజ్యమ్మ, భారతి, పెద్ద రూతమ్మ, దుర్గా సుశీలమ్మ, తిక్కమ్మ, చెన్నక్క, శేషమ్మ, అన్నమ్మ, సంజమ్మలను దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్, తహసీల్దార్ శివయ్య, ఎంపీడీఓ దశరథరామయ్య, ఎంఈఓ బాలాజీ నాయక్, ఏఓ విష్ణువర్దన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీకి చెందిన సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హరిసర్వోత్తమరావు, ప్రస్తుత అధ్యక్షుడు శివపుల్లారెడ్డి, నాయకులు రమణారెడ్డి, ఏసురత్నం, బాలీశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణుడు యాదవ్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment