Power plant construction
-
చెత్తతో ‘పవర్’ ఫుల్
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న చెత్తను.. ఉపయుక్తంగా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా చెత్త ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు సమీపంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను.. ప్రాసెస్ చేసేలా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ గత నెలలో ఆదేశించారు. ఆ మేరకు ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణపై రూపొందించిన నివేదికను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమర్పించగా.. ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. దీంతో 7.5 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిద్ధమైంది. సమీప పట్టణ స్థానిక సంస్థల నుంచి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 22 పట్టణ స్థానిక సంస్థల నుంచి చెత్త తరలింపు.. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 22 పట్టణ స్థానిక సంస్థలను క్లస్టర్‌గా ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో రోజూ సుమారు 850 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంచనా వేసింది. ఇందులో 400 మెట్రిక్ టన్నులు పొడి వ్యర్థాలు కాగా, మిగిలింది తడి చెత్త. తడి వ్యర్థాలను ముమ్మిడివరం, అమలాపురంలో ఏర్పాటు చేసిన కంపోస్ట్ ప్లాంట్ల ద్వారా ఎరువుగా మారుస్తున్నారు. మిగిలిన చోట్ల ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్లాంట్లలో ఇనుము, గాజు, ప్లాస్టిక్, రబ్బర్ వంటివి వేరుచేస్తున్నారు. పునర్ వినియోగానికి, బయో ఎరువుగా మార్చేందుకు వీలులేని చెత్తను రాజమండ్రి వద్ద ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు తరలిస్తారు. పర్యావరణానికి హాని కలగకుండా.. దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టడం, నదీ జలాల్లో పడేయడం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని నీతి ఆయోగ్ తేల్చింది. ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాలను ఆధునిక పద్ధతుల్లో విద్యుత్‌గా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు అనుగుణంగా రూ.640 కోట్లతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటిలో రోజూ సుమారు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి దాదాపు 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా ప్లాంట్లకు సమీపంలోని మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను ఈ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటి తరహాలోనే త్వరలో రాజమండ్రి వద్ద కూడా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
వేంపెంటకు ‘నవ’ వసంతం
సాక్షి, పాములపాడు(కర్నూలు) : వేంపెంటకు నవ వసంతం వచ్చింది. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. గ్రామంలోని నిప్పుల వాగుపై ర్యాంక్ మినీ హైడ్రాలిక్ పవర్‌ప్లాంటు నిర్మాణం రద్దయ్యింది. నూతన ప్రభుత్వం చొరవ తీసుకుని పవర్‌ప్లాంటును రద్దు చేయడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా వారు చేస్తున్న నిరాహార దీక్షలను శుక్రవారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ పవర్‌ప్లాంటును రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే శుక్రవారం గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ప్లాంట్ రద్దు చేస్తున్నట్లు జీఓ పత్రం ఇవ్వాలని దీక్షలో కూర్చున్న మహిళలు కోరారు. కలెక్టర్ స్పందిస్తూ సీఎం స్థాయిలో చెప్పిన విషయాన్ని వెంటనే అమలు చేస్తామని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జీఓ ఇస్తామని తెలిపారు. దీంతో వారు దీక్షల విరమణకు అంగీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేంపెంట వాసుల సుదీర్ఘ పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ మాట్లాడుతూ పవర్‌ప్లాంటు రద్దు చేస్తున్నట్లు ప్రకటన వెలువడడంతో గ్రామస్తుల మోములో చిరునవ్వు చూస్తున్నానన్నారు. గ్రామ శ్రేయస్సు కోసం చేసిన పోరాటం వృథా కాలేదన్నారు. అలాగే జగనన్న ఇచ్చిన మాటను నిలుపుకున్నారన్నారు. ఆయన మాటే జీఓ అన్నారు. ప్రజలు ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తాను ప్రతి సంక్షేమ పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని తెలిపారు. గ్రామంలో శ్మశాన వాటిక, రహదారి, గతంలో పవర్‌ప్లాంటు కోసం నిర్వహించిన బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులు, 1,567 రోజులుగా దీక్షలో కూర్చున్న వారికి ఆర్థిక సహకారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హర్షం వ్యక్తం చేసిన వేంపెంట వాసులు పవర్‌ప్లాంటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో వేంపెంట గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, స్థానిక ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌కు, సహకరించిన ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బహదూర్, సామేలు, డాక్టర్ శరత్, ఆనందరావు, శ్రీనివాసులు మాట్లాడుతూ పవర్‌ప్లాంటు నిర్వాహకులు మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇన్నాళ్లూ అధికారులు సైతం వారికి వత్తాసు పలికారన్నారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకంతోనే గాంధేయ మార్గంలో పోరాటం కొనసాగించామన్నారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న కష్టాలు, మానసిక వేదన గురించి వివరించారు. కలెక్టర్, ఎమ్మెల్యేకు సత్కారం కలెక్టర్, ఎమ్మెల్యేను గ్రామస్తులు దుశ్శాలువా, పూల మాలలతో సత్కరించారు. గ్రామ శ్రేయస్సు కోసం పోరాటంలో పాలుపంచుకున్న టీడీపీ నాయకుడు రామన్నగౌడును కూడా సత్కరించారు. అలాగే కలెక్టర్, ఎమ్మెల్యే దీక్షలో కూర్చున్న సామ్రాజ్యమ్మ, భారతి, పెద్ద రూతమ్మ, దుర్గా సుశీలమ్మ, తిక్కమ్మ, చెన్నక్క, శేషమ్మ, అన్నమ్మ, సంజమ్మలను దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్, తహసీల్దార్ శివయ్య, ఎంపీడీఓ దశరథరామయ్య, ఎంఈఓ బాలాజీ నాయక్, ఏఓ విష్ణువర్దన్‌రెడ్డి, వైఎస్సార్సీపీకి చెందిన సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హరిసర్వోత్తమరావు, ప్రస్తుత అధ్యక్షుడు శివపుల్లారెడ్డి, నాయకులు రమణారెడ్డి, ఏసురత్నం, బాలీశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కృష్ణుడు యాదవ్, మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ హామీతో వేంపెంట దీక్షలకు నేటితో ముగింపు
సాక్షి, పాములపాడు(కర్నూలు) : మండలంలోని వేంపెంట గ్రామంలో అక్రమంగా నిర్మించతలపెట్టిన ర్యాంక్ మినీ హైడ్రాలిక్ పవర్ ప్లాంటు రద్దు ప్రకటనతో దీక్షలు ముగియనున్నాయి. శుక్రవారం జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు వేంపెంటకు రానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వేంపెంట వాసుల 1,566 రోజుల పోరాటానికి తగిన ఫలితాన్ని అందించారు. టీడీపీ నాయకులు అక్రమ మార్గంలో, ఫోర్జరీ సంతకాలతో, వేంపెంట గ్రామాన్ని వెలుగోడు మండలంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించి అనుమతులు తెచ్చుకున్న విషయం విధితమే. ఈ విషయాన్ని గ్రామస్థులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరిస్తే.. అభివృద్ధిని అడ్డుకుంటారా.. అంటూ దురుసుగా ప్రవర్తించిన తీరు ఇప్పటికీ ఆ గ్రామస్థులకు కళ్ల ముందే కనపడుతోంది. ఇదే విషయాన్ని ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియజేయగా దీక్షా శిబిరం వద్దకు వచ్చి తాను అధికారంలోకి రాగానే పవర్ ప్లాంటు రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని ప్రకారం నేడు పవర్‌ప్లాంట్‌ను రద్దు చేస్తూ ఆ గ్రామ ప్రజలకు ఆనందపు ఫలాలను అందించారు. -
దామరచర్ల పవర్‌ప్లాంటు ఆపుతాం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మించ తలపెట్టిన 4 వేల మెగావాట్ల అల్ట్రా పవర్ ప్లాంటును ఆపి తీరుతామని టీపీసీసీ పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.80 వేల కోట్ల భారం పడుతోందని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టి నల్లగొండ జిల్లా ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ప్రాణా లను పణంగా పెట్టి ప్రాజెక్టులు కట్టి కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారన్నారు. సిమెం టు, ఫార్మా పరిశ్రమలతో ఇప్పటికే నల్లగొండలో కాలుష్యం పెరిగిపోయిందని, తాగు, సాగునీటి లో ఫ్లోరైడ్ ఉందని, పంటల దిగుబడి కూడా తగ్గి పోతోందన్నారు. మళ్లీ ఇప్పుడు సల్ఫేట్లు, నైట్రేట్లు, మెర్క్యురీ, కోల్, ఫ్లైయాష్ కలిసే ప్లాంటు నిర్మించి నల్లగొండ జిల్లా ప్రజల ప్రాణా లకు ముప్పు తెస్తారా.. అని ప్రశ్నించారు. థర్మల్‌ప్లాంట్లు ఏర్పాటు చేయడం మంచిది కాదని, పర్యావరణానికి చేటు తెస్తుందని ప్యారిస్ సమ్మిట్, జాతీయ మీడియాలో చర్చ జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ప్లాంటు విషయంలో గుడ్డిగా ముందుకు పోతోందని విమర్శించారు. ప్లాంటు ఆపాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఇదే విషయాన్ని పార్టీలో చర్చించి ఒప్పిస్తానన్నారు. -
శ్రీకాకుళంలో థర్మల్ సెగలు
-
'పవర్‌ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నాం'
పాములపాడు (కర్నూలు) : కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో పవర్‌ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఉంటామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. మండలంలోని వేంపెంట గ్రామంలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఆందోళనకు రఘువీరారెడ్డి సోమవారం మద్దతు తెలిపారు. ఆయన వేంపెంటలోని ప్రాజెక్టును సందర్శించి నిరసనకారులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. -
మర్చంట్ పవర్ ప్లాంట్లతో వినాశనం
శ్రీకాకుళం అర్బన్: మర్చంట్ థర్మల్ పవర్ప్లాంట్లను పెట్టి జిల్లాను సర్వనాశనం చేసేం దుకు ప్రభుత్వం చూస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీసభ్యుడు తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని, అందులో ఒక్క యూనిట్ కరెంట్ జిల్లా ప్రజల ప్రయోజనం కోసం కేటాయించగలరా అని ప్రశ్నించారు. కేవలం వ్యాపార సంబంధమైన ప్రాజక్టులను జిల్లాలో పెట్టి ప్రజల జీవితాలను నాశనం చేసేందుకేనని దుయ్యబట్టారు. జనానికి మేలు చేయని పవర్ప్లాంట్లకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే పెట్టే తొలిసంతకాల్లో ఒక సంతకం ప్రాజెక్టు రద్దుపైనే తమ అధినేత జగన్ పెట్టేవారన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోంపేట, మందస ప్రాంతాల్లో పర్యటించినపుడు తాము అధికారంలోకి వస్తే సోంపేట, కాకరాపల్లి ప్రాంతాల్లోని పవర్‌ప్రాజెక్టులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని..ఇపుడు అధికారం చేపట్టాక వాటికి మద్దతు తెలపడం శోచనీయమన్నారు. పవర్ప్లాంట్ల రద్దుకు టీడీపీ మహానాడులో తనతోనే తీర్మా నం చేయించారని, దీనికి సోమిరెడ్డి చంద్రమోహన్ ప్రతిపాదించిన విషయూన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది వాస్తవం కాదని మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సిగ్గు, లజ్జ ఏదీ లేదని ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపాధి కల్పించే మత్స్య, కొబ్బరి, జీడి, ఖనిజ నిక్షేపాల పరిశ్రమల స్థాపన కోసం కృషిచేయకుండా ప్రజల వినాశం కోరే ప్రాజక్టు లు తెస్తామనడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. కొంతమంది బడా పారిశ్రామికవేత్తల కోసం, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం పొందూరులో మర్చంట్ థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మించడానికి యత్నిస్తే...వీపు విమానం మోత మోగక తప్పదని హెచ్చరించారు. ఇక్కడ ప్లాంట్ నెలకొల్పడానికి ప్రభుత్వం ముందుకు వస్తే ఏర్పడబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. థర్మల్ పవర్ప్లాంట్లపై అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌లో జరిగిన యూఎన్వో సమావేశంలో ఉద్గారాలు వెదజల్లే పరిశ్రమలకు అనుమతులు ఇవ్వరాదని తీర్మానం చేస్తూ సంతకం చేసినట్టు ఈ సందర్భగా చెప్పారు. ఆమదాలవలసలో సుగర్‌ఫ్యాక్టరీ తెరిపిస్తామని చంద్రబాబు, కూన రవిలు చెప్పారని దీనిపై దృష్టి సారించాల న్నారు. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళల రుణంపై కనీసం మాట్లాడడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలన విక్రాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేస్తున్నామన్నారు. జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమని, రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటుధరను ప్రభుత్వం కల్పించాలన్నారు. తుపానులో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, శిమ్మ రాజశేఖర్, మండవిల్లి రవి, మొదలవలస లీలామోహన్, గుడ్ల మల్లేశ్వరరావు, గుడ్ల దామోదర్, పాలిశెట్టి మధుబాబు, గొర్లె రాజగోపాల్ ఉన్నారు.