
భూములు కొంటే తప్పేంటి?
* నేను బిల్డర్‌ని, రియల్ ఎస్టేట్ వ్యాపారిని
* రాజమండ్రి ఎంపీ మురళీమోహన్
తుళ్లూరు: ‘నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, బిల్డర్‌ను.. భూములు కొంటే తప్పేంటి..’ అని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని గ్రామపెద్ద పెద్దారావు ఇంటివద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన రాజధాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజారాజాధానిగా రూపొందాలని తుళ్లూరు మండలాన్ని ముఖ్యమంత్రి ఎంపిక చేశారని చెప్పారు.
ఇక్కడి యువకులకు విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ఇక్కడకు వస్తారని, విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే ఇలా భవిష్యత్ తరాలు చెప్పుకొనే రీతిలో రాజధాని నిర్మిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భూములు కొన్నారా అని అడగ్గా ఒక్క సెంటు భూమి కూడా కొనలేదని, కొన్నట్లు నిరూపిస్తే పేదలకు రాసి ఇచ్చేస్తానని చెప్పారు.
స్వతహాగా తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డర్‌నని ఒకవేళ కొంటే మాత్రం తప్పేమిటని ప్రశ్నించారు. ఆయన వెంట ఎంకేఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముప్పవరపు కృష్ణారావు, స్నేహహస్తాలు ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు అనుమోలు సత్యనారాయణ తదితరులున్నారు.