ఎవరెన్ని కుట్రలు చేసినా రాజీనామా చేయను
గన్నవరం : ఎవరెన్ని కుట్రలు చేసినా తన పదవీకాలం 2016 సెప్టెంబర్ 30 వరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని కృష్ణాజిల్లా మిల్క్ యూనియన్ చైర్మన్ మండవ జానకిరామయ్య తేల్చిచెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తి మద్దతు కూడా తనకే ఉందని ఆయన స్పష్టం చేశారు. పాలకవర్గంలోని ముగ్గురు డెరైక్టర్ల పదవులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక రావ్‌ఫిన్ రియల్ ఎస్టేట్‌లోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 23 ఏళ్లుగా చైర్మన్ పదవిలో కొనసాగుతున్న తాను సంస్థ వ్యాపార టర్నోవర్‌ను రూ.27 కోట్ల నుంచి రూ.432 కోట్లకు పెంచడంతో పాటు సుప్రీంకోర్టులో రైతుల స్వయం ప్రతిపత్తి కోసం పోరాడి విజయం సాధించినట్లు తెలిపారు.
ఆనాడు ఎన్టీఆర్ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జిల్లాలోని రైతులకు బాసటగా నిలవడంతో పాటు అవినీతిపరులైన డెరైక్టర్లను బోర్డు నుంచి తప్పించానని చెప్పారు. లాభాల బాటలో ఉన్న యూనియన్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు కొంతమంది కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగా సంస్థలో పనిచేస్తున్న మేనేజర్లకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడడంతో పాటు తనను పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సంస్థ ఉద్యోగుల జోలికి వెళ్లినా, సంస్థకు నష్టం కలిగించే పనులు చేసినా సహించేది లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావుకు ఆరోజు బోర్డు డెరైక్టర్ పదవి తానే ఇచ్చానన్నారు.
అయితే కొంతమంది డెరైక్టర్లతో కలిసి చంద్రబాబుకు తనపై తప్పుడు సమాచారం ఇవ్వడం బాధాకరమన్నారు. బాబుకు వాస్తవాలు తెలుసని, ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా తనపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. తనను రాజీనామా చేయమని బాబు ఏరోజూ కోరలేదన్నారు. సీఎం ఆదేశాల మేరకే నడుచుకుంటానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తొలుత డెరైక్టర్ల ఎన్నిక రాజీకి తాను అంగీకరించినప్పటికీ ప్రత్యర్థులు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని త్వరలో బాబును కలిసి వివరిస్తానని చెప్పారు.
ఆ ముగ్గురిని గెలిపించండి...
ఈ నెల 25న జరగనున్న పాలకవర్గంలో ఖాళీ అయిన ముగ్గురు బోర్డు డెరైక్టర్ల పదవులకు పోటీ చేస్తున్న మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి, వీబీకేవీ సుబ్బారావు, జాస్తి రాధాకృష్ణలను గెలిపించాలని మండవ కోరారు. నీతిమంతమైన పాలన కోసం వీరికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు డెరైక్టర్లు పాల్గొన్నారు.