నా శాఖలను దానం చేశా: పల్లె
పుట్టపర్తి టౌన్: తాను మైనారిటీ శాఖను సీఎం చంద్రబాబుకు, ఐటీ శాఖను లోకేశ్‌కు, టూరిజం శాఖను అఖిల ప్రియకు, సమాచార శాఖను కాలవ శ్రీనివాసులుకు, ఎన్‌ఆర్‌ఐ శాఖను కొల్లు రవీంద్రకు దానం చేశానని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని పర్తిసాయి ధర్మశాలలో టీడీపీ సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినాయకుడు చంద్రబాబు కోరిన వెంటనే తాను పదవికి రాజీనామా చేశానన్నారు.
అనంతరం పుట్టపర్తి నగర పంచాయతీ టీడీపీ కన్వీనర్ పదవికి ఆశావహుల పేర్లను సేకరించారు. పార్టీ నిర్ణయం మేరకు కన్వీనర్ పేరును త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకుడు రమణారెడ్డి, చైర్మన్ పి.సి.గంగన్న, పుడా మాజీ చైర్మన్ కడియాల సుధాకర్, వైస్ చైర్మన్ కడియాల రాము, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ పునర్య్వస్థీకరణలో రఘునాథరెడ్డి మంత్రి పదవిని కోల్పోయారు. తనను కేబినెట్ నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.