
వైఎస్ జగన్ పోరాటాలు చూసే పార్టీలో చేరా
హైదరాబాద్ : ప్రజల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలు చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని ఉషశ్రీ చరణ్ తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆమె సోమవారమిక్కడ అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఉన్న ఉషశ్రీ చరణ్ సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మరోవైపు అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా నేతలు మాట్లాడుతూ సమీక్షా సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించినట్లు చెప్పారు. చంద్రబాబు సర్కార్ వచ్చి ఆరు నెలలు అయినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు.
ఒక్క అనంతపురం జిల్లాలోనే 60మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. జిల్లాలో తీవ్ర కరువు కాటకాలు ఏర్పడ్డాయని, దీంతో వలసలు విపరీతంగా పెరిగినట్లు చెప్పారు. సమావేశంలో శంకర్ నారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే చాంద్ బాషా, ఇతర నేతలు పాల్గొన్నారు.