ఇంకా వేచి ఉండవలే..
- ఎన్నికైనా పదవీ ప్రమాణం లేదు
- ఎంపీ నుంచి కౌన్సిలర్ వరకు నిరీక్షణ
- అపాయింటెడ్ డే తరువాతే అధికారపగ్గాలు
- ఖరారు కాని తేదీలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రజాప్రతినిధులకు వింత పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. విజయానందం ఉన్నా ఇంకా అధికారం చేతికి రాలేదు. కౌన్సిలర్ల నుంచి ఎంపీ విజేతల వరకు అధికార పగ్గాల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా జూన్ 2 అపాయింటెడ్ డే వరకు ఏ ఒక్కరూ పదవీ ప్రమాణం చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ తరువాత కూడా ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటవుతుందో కూడా తెలియని పరిస్థితి. స్థానిక పీఠాలను అధిరోహించే తేదీలు ఇప్పటికీ ఖరారు కాకపోవడంతో విజేతలు అయోమయంతో ఎదురుచూపులు చూస్తున్నారు.
వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ముందుగా మార్చి 30న నర్పీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. మరో వారం రోజుల్లో వీటి ఓట్ల లెక్కింపు జరుగుతుందన్న సమయంలో వీటి ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై పడతాయని సుప్రీంకోర్టు కౌంటింగ్‌ను వాయిదా వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత ఏప్రిల్‌లో రెండు దఫాల్లో 39 జెడ్పీటీసీలకు, 656 ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా అదే విధంగా వాయిదా పడ్డాయి.
దీంతో ఈ రెండింటికి పోలింగ్ ముగిసినప్పటికీ ఫలితాల కోసం అభ్యర్థులు నెలన్నరపాటు ఉత్కంఠగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తరువాత ఈ నెల 7న సార్వత్రిక ఎన్నికలు జరగగా 16న కౌంటింగ్ ముగిసింది. మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులెవరో తేలిపోయింది. అయితే ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వీరు అధికారికంగా ఆ హోదాలను అనుభవించలేని వింత పరిస్థితి ఏర్పడింది. రాష్ర్ట విభజన కారణంగా ఈ దఫా ప్రమాణ స్వీకారాలకు జాప్యం జరుగుతోంది.
జూన్ 2 తరువాతే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు జూన్ 2న అపాయింటెడ్ డేగా నిర్ణయించారు. అధికారికంగా ఆ రోజుతో రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తవుతుంది.
అపాయింటెడ్ డే తరువాతే ప్రజాప్రతినిధులు బాధ్యతలు స్వీకరించాలన్న నిబంధన వారి ఉత్సాహంపై నీళ్లు చల్లింది. రోజుల తరబడి వేచి ఉండేలా చేసింది. జూన్ 2నే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముందు భావించారు. అయితే ఇప్పటి వరకు ఆ విషయంపై స్పష్టత లేదు. సీఎం ప్రమాణ స్వీకారం ఎప్పుడు, ఎక్కడన్న విషయం కూడా ఇంకా ఖరారు కాలేదు. దీంతో జిల్లాలో 15 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల నుంచి గెలిచిన అభ్యర్థులు ఆ తేదీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రజాప్రతినిధుల ప్రసన్నం కోసం...
గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారాలు చేయకముందే, అధికార పగ్గాలు చేపట్టక మునుపే వారిని ప్రసన్నం చేసుకోడానికి కొంత మంది అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అధికారుల పదోన్నతులు, బదిలీలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అప్పటి వరకు ఎవరికీ బదిలీలకు అవకాశం లేదు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంచి పోస్టింగ్‌ల కోసం ఇప్పటినుంచే ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగితేలుతున్నారు. గెలిచిన వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
స్థానిక అధికారం ఎప్పుడో..
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎమ్మెల్యే, ఎంపీలు కొలువుతీరిన తరువాతే వీరి ప్రమాణ స్వీకారాలు ఉండనున్నాయి. అయితే ఆ రోజు ఎప్పుడన్న విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. దీంతో అభ్యర్థులు ఉసూరుమంటూ నిట్టూరుస్తున్నారు.