
ఎర్రగుంట్ల సీఐ వెంకటరమణకు షార్టు గన్‌ను అప్పగిస్తున్న డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి
ఎర్రగుంట్ల : టీడీపీ నేతలైన మంత్రి ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల నుంచి తనకు ప్రమాదం లేకుండా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అని వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి అన్నారు. తన వద్ద ఉన్న అనుమతిగల షార్టు గన్(ఆయుధం) గురువారం ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్‌లో సీఐ వెంకటరమణకు సరెండర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రధాన పార్టీ అయిన వైఎస్సార్ సీపీ అభ్యర్థినని , తనకు పోటీగా ఉన్న ప్రత్యర్థులు మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఫ్యాక్షనిస్టులు, హత్యలు కుట్రలు, కుతంత్రాలు చేసే వారని అందుకే తనకు భద్రత కల్పించాలని కోరారు.
ప్రస్తుతం రాత్రి సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు గ్రామాలకు ప్రచారానికి వెళుతుంటానని, తనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. తనకు రాజకీయంగా ప్రమాదం ఉందనే పోలీసులు తనకు షార్టు గన్ ఇచ్చారని, నేడు పోలీసులు అడిగిన మేరకు షార్టు గన్‌ను అప్పగించినట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు ఎలాంటి వ్యక్తిగత భద్రత లేదన్నారు. తనకు భద్రత కల్పించాలని ఇది వరకే జమ్మలమడుగు డీఎస్పీకి విన్నవించానని, జిల్లా ఎస్పీ ని కూడా కలిసి విన్నవిస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment