నాకు స్పష్టమైన జవాబు కావాలి అధ్యక్షా!
రోడ్డు ప్రమాదాలపై అసెంబ్లీలో శోభానాగిరెడ్డి తనయ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటిసారి మాట్లాడిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అందర్నీ ఆకట్టుకున్నారు. దివంగత శోభా నాగిరెడ్డి స్థానంలో ఎన్నికైన అఖిల సోమవారం జీరో అవర్‌లో మాట్లాడారు. తన తల్లి మృతికి కారణమైన రోడ్డు ప్రమాదాలను తొలి అంశంగా ఎంచుకుని సభను ఆకట్టుకున్నారు. ఎంతో అనుభవజ్ఞులైన పెద్దల ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతూనే తాను ఏ పరిస్థితుల్లో అసెంబ్లీకి ఎన్నికైందీ వివరించారు. ‘అమ్మ స్థానంలో ఉండి నేను ఈవేళ మాట్లాడుతున్నాను. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాగలమర్రి-నంద్యాల రోడ్డులో ఇటీవలి కాలంలో 12 ప్రమాదాలు జరిగాయి. అయినా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. చిన్నచిన్న కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
రోడ్లపై దారి మళ్లింపు గుర్తులు, గుంతల పూడ్చివేతలు, మరమ్మతులు చేపట్టమని మా అమ్మ ఎన్నో లేఖలు రాసింది. అయినా పట్టించుకోలేదు. ఫలితంగా అమ్మనే కోల్పోయా. నా అనుభవం మరెవ్వరికీ రాకూడదు. అందువల్ల చూస్తాం, చేస్తాం, సంబంధిత మంత్రికి చెబుతాం.. అని చెప్పకుండా సూటిగా నా ప్రశ్నకు సమాధానం కావాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో సంబంధిత మంత్రితో చెప్పించాలని కోరుతున్నా అధ్యక్షా..’ అంటూ ముగించినప్పుడు పార్టీలతో నిమిత్తం లేకుండా సభ్యులు అభినందించారు. రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యల్ని వివరించారు. సభ్యురాలు చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ సమస్య తీవ్రమైందని, ఆ అంశంపై మాట్లాడేందుకు అఖిల అర్హమైన సభ్యురాలని అన్నారు.