'ఆరోగ్యం బాగోలేదనే రాజకీయాలకు దూరం'
తిరుమల : తన ఆరోగ్యం సహకరించనందునే రాజకీయాలకు దూరంగా ఉన్నానని మాజీమంత్రి శైలజానాథ్ తెలిపారు. ఆయన బుధవారం తిరుమల విచ్చేసి వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ ఒకటి, రెండు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్ను ప్రకటిస్తానని తెలిపారు. కాగా శైలజానాథ్ ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో చెస్ట్ ట్యూమర్‌కు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.
ఇక శైలజానాథ్ రాజకీయ పయనంపై సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఆయన ఏ పార్టీవైపు వెళతారోనన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రను కాంక్షిస్తూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా శైలజానాథ్ పనిచేశారు. పార్టీ అధిష్టానం ఎదుట సమైక్య నినాదాన్ని వినిపించారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్ష పదవిని శైలజనాథ్కు అప్పగించారు. అయితే ఆ పార్టీకి అనుకున్నంతగా ఆదరణ లేకపోవటంతో ఆయన ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శైలజానాథ్ టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.