
చైనాలా అభివృద్ధి చేస్తా
- శక్తివంతమైందిగా తీర్చిదిద్దుతా: సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
సాక్షి, హైదరాబాద్: ‘‘చైనా 1978లో పేద దేశం. కమ్యూనిస్టు దేశమైన చైనా 1991లో ఆర్థిక సంస్కరణలను చేపట్టింది. స్పీడ్(వేగం), స్కేల్(కొలమానం), స్కిల్స్(నైపుణ్యం)లను అందిపుచ్చుకుని ప్రపంచంలో శక్తిమంతమైన దేశంగా అభివృద్ధి చెందింది. గత 24 ఏళ్లలో 68 శాతం సంపదను ఆ దేశం సృష్టించగలిగింది. హార్డ్‌వేర్, రైల్వే, నిర్మాణ, నీటిపారుదల రంగాల్లో ప్రపంచంలో చైనా ప్రథమస్థానంలో ఉంది. చైనా ఇదే స్థాయిలో అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే.. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టక తప్పదు. ప్రపంచంలో ఒక్క భారతదేశం.. అందులోనూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశం. చైనా ప్రభుత్వంతో 17.. ప్రైవేటు సంస్థలతో 12 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందాల మేరకు రాష్ట్రంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు చైనా ముందుకొస్తుందని ఆశిస్తున్నాం.
చైనా స్ఫూర్తితో రాష్ట్రాన్ని శక్తిమంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆరురోజుల చైనా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం శనివారం సచివాలయంలో విలేకరులకు తన పర్యటన విశేషాలను వెల్లడించారు. మన దేశ విదేశీవ్యవహారాల శాఖ, చైనాలోని ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆహ్వానం మేరకు 30 మంది అధికార, పారిశ్రామికవేత్తల బృందంతో బీజింగ్, చెంగ్డు, షాంఘైల్లో పర్యటించానన్నారు. రాష్ట్రంలోనూ.. రాజధాని అమరావతిలోనూ భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్న తన ప్రతిపాదనకు చైనా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
సరిహద్దు వివాదాన్ని కొట్టిపారేసిన బాబు:
మనదేశంతో చైనాకు సరిహద్దు వివాదం ఉండటం.. పాకిస్థాన్‌కు చైనా ఆర్థికసాయం చేస్తున్నందున.. ఆ దేశం మనరాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందన్న నమ్మకం మీకుందా? అని ప్రశ్నించగా.. దాన్ని కొట్టిపారేశారు. ప్రధాని కూడా త్వరలో అక్కడ పర్యటిస్తారని చెప్పారు. సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ఇవ్వగానే సింగపూర్, జపాన్, చైనాల సహకారంతో రాజధాని నిర్మిస్తామని తెలిపారు.
భూగర్భజలాల పెంపునకు కన్సల్టెన్సీ!
రాష్ట్రంలో భూగర్భజలాలను పెంచేందుకుగాను కన్సల్టెన్సీలను పెట్టుకొని వారి సూచనలు పాటించాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు.శనివారం ఆయన నీరు-చెట్టు కార్యక్రమం అమలు ప్రగతిని సమీక్షించారు. మరో సమీక్షలో అకాల వర్షాలపై చర్చించారు.
రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనకు : ఈ నెల 20 నుంచి పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. తన జన్మదినం రోజైన ఈ నెల 20న సీమ జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనున్నారు. అనంతరం 21న ముస్సోరిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. 23న మహబూబ్‌నగర్ లో జరిగే కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. 24న విశాఖజిల్లాలో ఇండస్ట్రియల్ మిషన్‌ను ప్రారంభిస్తారు. 29న ఢిల్లీ వెళ్లనున్నారు.
అద్దె ఇంటికి మారిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం అద్దెంటికి మారారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 65లోని సొంతింటిని కూల్చేసి దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించ తలపెట్టారు. ఈ కారణంగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 24లో తీసుకున్న అద్దె ఇంటికి మకాం మార్చారు. చైనా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలసి అద్దె ఇంటికెళ్లారు. కొత్త భవన నిర్మాణం పూర్తయ్యేదాకా ఆయన ఇక్కడే ఉంటారు. కాగా బాబు భద్రతకు అడ్డంకిగా మారొచ్చనే ఉద్దేశంతో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 24 పరిసరాల్లో ఉన్న బడ్డీ కొట్లతోపాటు చిన్న చిన్న దుకాణాల్ని జూబ్లీహిల్స్ పోలీసులు తొలగించారు.