త్వరలో దర్శకత్వం చేస్తా
త్వరలో దర్శకత్వం చేస్తా
Published Wed, Jan 8 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
పండించడం ఓ వరమని హాస్యనటుడు ఎర్ర రఘుబాబు అన్నారు. సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు మంగళవారం నిడదవోలు వచ్చిన ఆయన ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించారు. రఘుబాబు మాట్లాడుతూ ‘1991లో గురువు సత్యారెడ్డి దర్శకత్వంలో దొంగలున్నారు.. జాగ్రత్త సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. మా తండ్రి గిరిబాబును ఆదర్శంగా తీసుకుని నటనపై ఆసక్తి పెంచుకున్నాను. మంచి నటుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలనే తపనతో కష్టపడి నటుడిగా గుర్తింపు పొందాను. గిరిబాబు కొడుకు కదా అని ఎవరూ పిలిచి అవకాశాలు ఇవ్వలేదు.
ఎలాంటి సిఫార్సులు లేకుండా పరిశ్రమలో గుర్తింపు పొందడంతో నాన్న ఎంతో గర్వపడుతున్నారు. ఇప్పటివరకు 253 చిత్రాల్లో నటించాను. తెలుగులో 250, తమిళంలో రెండు, కన్నడంలో ఒక సినిమాలో నటించా. మురారి, ఆది, కబడ్డీ కబడ్డీ, చెన్నకేశవరెడ్డి, బెట్టింగ్ బంగార్రాజు, ఖడ్గం, దిల్, వేదం చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం సునీల్ హీరోగా భీమవరంబుల్లోడు, మోహన్‌బాబు తనయులతో పాండవులు పాండవులు తుమ్మెద, చార్మి హీరోయిన్‌గా ప్రతిఘటన-2, రేసుగుర్రం సినిమాల్లో నటిస్తున్నా. త్వరలో ఎన్టీఆర్ రభస, మహేష్ ఆగడు, వీవీ వినాయక్ సినిమాల్లో నటించనున్నాను. హాస్యాన్ని పండించడం నాకు దేవుడిచ్చిన వరం. ఇది అందరికీ సాధ్యపడదు.
సినీ పరిశ్రమలో పోటీని తట్టుకుని ప్రతిభ చూపేవారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కొత్తదనంతో కామెడీను పండిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. పలువురు వీఐపీలు, ఉద్యోగులు, వైద్యులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కామెడీ చిత్రాలు చూస్తున్నారు. దేశంలో ఏ పరిశ్రమలో లేనంత మంది హాస్యనటులు తెలుగు చిత్రసీమలో ఉన్నారు. అన్నీ కలిసి వస్తే త్వరలో దర్శకత్వం చేస్తా. సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రానికి దర్శకత్వం వహించాలన్నదే నా ఆశ’. అని మనసులోని మాటను చెప్పారు.
నేటినుంచి పట్టిసీమలో షూటింగ్
అల్లరి నరేష్ హీరోగా ఈ.సత్తిబాబు దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ మంగళవారం నిడదవోలు గాంధీనగర్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో జరిగింది. హాస్యనటులు రఘుబాబు, ఖయ్యుం, జీవా, రావు రమేష్, భరత్‌పై కొన్ని హాస్యసన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. చిత్ర కథలో భాగంగా నటులు జీవా వైద్యునిగా, రావు రమేష్, రఘుబాబు రోగులుగా సన్నివేశాలను తెరకెక్కించారు. హాస్యనటుల రాకతో గాంధీనగర్ ప్రాంతంలో సందడి నెలకొంది. షూటింగ్‌ను తిలకించేందుకు స్థానికులు ఆసక్తి కనబర్చారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు పట్టిసీమలో షూటింగ్ చేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు.
Advertisement
Advertisement