ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే వరకు పారాటం సాగిస్తానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం ముస్లింలకు అన్ని రంగాల్లో 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్‌లోని రోజ్ గార్డెన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒక అడుగు ముందుకు వెళ్తే, అగ్రకుల ఆధిపత్యంతో ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. స్వాతంత్య్రానంతరం విద్యా, ఉద్యోగ రంగాల్లో 30 నుంచి 40 శాతం ఉన్న ముస్లింలు ప్రస్తుతం మూడు శాతానికి వచ్చారన్నారు.
ముస్లింలకు సమస్యలు వస్తే చెప్పుకునేందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడన్నారు. సమాజంలో ఏ వర్గం వెనుకబడి ఉంటే, ఆ వర్గానికి అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి ముస్లింలకు అండగా నిలుస్తుందని, బాబ్రీ మసీదు కూల్చివేత, గోద్రా అల్లర్ల సమయంలో పూర్తి మద్దతు ప్రకటించానన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని సామాజిక న్యాయమే లక్ష్యంగా, జనవరి 4న కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భాగస్వామ్యంతో రాజ్యాధికారం లక్ష్యంగా పని చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం వికలాంగులు, ఎమ్మార్పీఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్, జిల్లా అధ్యక్షుడు పెద్ద సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు అమీన, వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇస్లాంబిన్ హసన్, ఎంఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాంపెల్లి ఊశన్న, ముస్లిం నాయకులు అవద్‌బిన్ మోసిన్, ముబీన్, శేక్ చాంద్, జాఫర్, ఉమేద్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సునీల్, మండల అధ్యక్షుడు ఇప్పదాసు, నాయకులు నాగరాజు, వడ్లూరి కృష్ణ , వికలాంగులు, వితంతువులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
ముస్లింలు అభివృద్ధి చెందే వరకు పోరాడుతా..
Published Mon, Dec 23 2013 3:15 AM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
Advertisement
Advertisement