తెలంగాణను అడ్డుకునే శక్తి ఎవరికి లేదు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ప్రస్థానం విజయ తీరాలకు చేరబోతున్నదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు అన్నారు. అయితే లక్ష్యాన్ని ముద్దాడేంత వరకు ఉద్యమాన్ని వీడేది లేదు ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నాయకుడు కే కేశవరావు నివాసంలో ఢిల్లీ పరిమాణాలపై జేఏసీ, టీఆర్ఎస్ నేతలతో సమీక్ష నిర్వహించారు.
కేకే నివాసంలో సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని.. దానిని ఆపే శక్తి ఎవరికి లేదని ఆయన అన్నారు. కాని తెలంగాణ ఉద్యమ సంస్థలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన హెచ్చరించారు. ఏపీఎన్జీఓల సభ అంత గొప్పదేమి కాదని ఆయన వ్యాఖ్యాలు చేశారు.
10 జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారని ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలకు తాను వివరించానని కేసీఆర్ తెలిపారు. ఏప్రాంతమైతే ఆంధ్రతో కలిసిందో.. ఆ ప్రాంతమే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడాలని, ఇతర ప్రత్యామ్నాయాలను అంగీకరించబోమని కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్ లో సదస్సు నిర్వహించడానికి ప్రయత్నాలు చేపట్టామని.. వేదికపై పలు సూచనలు వచ్చాయని.. అయితే సెప్టెంబర్ 12వ తేదిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో వేదికపై స్పష్టమైన సమాచారం తేలుతుందన్నారు. హైదరాబాద్ లో సదస్సు నిర్వహిస్తాం.. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించాలని వచ్చిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు అనేక అవమానాలకు తాను గురైనానని.. అయితే తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి అవమానాలకైనా సిద్ధమని, 10 జిల్లాలతో కూడిన, ఆంక్షలు లేని తెలంగాణ కావాలని మరోమారు స్పష్టం చేశారు.