మద్దతుదారుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్‌ఆర్ కుటుంబంలో భాగస్వాములవుదామని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డికి ఆయన మద్దతుదారులు ముక్త కంఠంతో సూచించారు. జై కాటసాని..జై వైఎస్ జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుధవారం నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాలులో పార్టీ మార్పుపై కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన భార్య ఉమామహేశ్వరి, కుమారుడు శివ నరసింహారెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం, గడివేముల, ఓర్వకల్, కల్లూరు మండలాల నుంచి వేలాదిమంది తరలివచ్చారు. ముందుగా ప్రభాకరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలసి పాణ్యం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి పేదలకు సేవ చేశారని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి నడవాలని సూచించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితేనే తమకు సమ్మతమని ఎక్కువ మంది చెప్పడం విశేషం. అనంతరం కాటసాని సతీమణి ఉమామహేశ్వరి మాట్లాడుతూ..1985 నుంచి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్నారని చెప్పారు. పదవిలో ఉన్నా.. లేకున్నా తమ కుటుంబం ప్రజాసేవలో ఉందని, మద్దతుదారులు తమపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలని చెప్పారు.
అనంతరం కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్ కోసం కార్యకర్తలు, అనుచరులు చూపుతున్న అభిమానం, ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మీరంతా ఏ పార్టీ సూచిస్తే ఆ పార్టీలో చేరుతానని కాటసాని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటంతో రాజకీయ సమీకరణాలు మారాయని..దాంతో పార్టీ మారాల్సి వస్తోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు న్యాయం చేసే పార్టీలో కార్యకర్తలు, అభిమానుల అభిమతం మేరకు చేరుతానని, తన నిర్ణయాన్ని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు ఇప్పుడే ప్రకటించాలని కాటసాని ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
మీ సలహాలు, సూచనల మేరకు నడుచుకుంటానని, మరికొంతమంది ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాణ్యం చంద్రారెడ్డి, ఆనందు, హనుమంతరెడ్డి, వై.సుధా, కృష్ణమూర్తి, రిటైర్డ్ డీఎస్పీ జయచంద్ర, రిటైర్డ్ సీఐ విజయకృష్ణ, గడివేముల చంద్రశేఖరరెడ్డి, రామలక్ష్మమ్మ, గడివేముల ఎంపీటీసీ బాలచందర్, శివ, గోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, బిలకలగూడూరు చంద్రశేఖరరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వీరయ్యస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment