katasani rambhupalreddy
-
పేదల భూములు లాక్కోవడం టీడీపీ నైజం
ఓర్వకల్లు (కర్నూలు): పేదల భూములు లాక్కోవడం టీడీపీ నైజమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. కేతవరం గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయ భవనాన్ని బుధవారం.. సర్పంచు పాపన్న, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బన్న ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాటసానితో పాటు వైఎస్సార్సీపీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూడిచెర్ల గ్రామానికి చెందిన రైతుల భూములను రిలయన్స్ కంపెనీకి ధారాదత్తం చేసినట్లు టీడీపీ నేత ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతుల భూములు తీసుకోకుండా ఉండేందుకు అప్పట్లో తానే స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. అలాగే గవర్నర్ వద్దకు రైతులను పంపి భూములు తీసుకోవడాన్ని రద్దు చేయించానన్నారు. టీడీపీ నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి నిజాలు తెలుసుకోకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎయిర్‌పోర్టు సమీపాన పూడిచెర్ల గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు సాగులో ఉన్న రైతుల భూములను రాత్రికిరాత్రి అన్లైన్లో పేర్లు మార్చిన ఘనత టీడీపీ నేతలదేనన్నారు. అక్రమాలపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశామని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దమ్ముంటే ఈ భూములపై విచారణ జరిపించాలని ఏరాసుకు సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ నాయకులు మీదివేముల ప్రభాకర్‌రెడ్డి, పూడిచెర్ల రాజన్న, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి కాటసాని రాంభూపాల్‌రెడ్డి..?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్ఆర్ కుటుంబంలో భాగస్వాములవుదామని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్రెడ్డికి ఆయన మద్దతుదారులు ముక్త కంఠంతో సూచించారు. జై కాటసాని..జై వైఎస్ జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుధవారం నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాలులో పార్టీ మార్పుపై కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన భార్య ఉమామహేశ్వరి, కుమారుడు శివ నరసింహారెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం, గడివేముల, ఓర్వకల్, కల్లూరు మండలాల నుంచి వేలాదిమంది తరలివచ్చారు. ముందుగా ప్రభాకరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలసి పాణ్యం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి పేదలకు సేవ చేశారని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి నడవాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితేనే తమకు సమ్మతమని ఎక్కువ మంది చెప్పడం విశేషం. అనంతరం కాటసాని సతీమణి ఉమామహేశ్వరి మాట్లాడుతూ..1985 నుంచి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్నారని చెప్పారు. పదవిలో ఉన్నా.. లేకున్నా తమ కుటుంబం ప్రజాసేవలో ఉందని, మద్దతుదారులు తమపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలని చెప్పారు. అనంతరం కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్ కోసం కార్యకర్తలు, అనుచరులు చూపుతున్న అభిమానం, ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మీరంతా ఏ పార్టీ సూచిస్తే ఆ పార్టీలో చేరుతానని కాటసాని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటంతో రాజకీయ సమీకరణాలు మారాయని..దాంతో పార్టీ మారాల్సి వస్తోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు న్యాయం చేసే పార్టీలో కార్యకర్తలు, అభిమానుల అభిమతం మేరకు చేరుతానని, తన నిర్ణయాన్ని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ఇప్పుడే ప్రకటించాలని కాటసాని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మీ సలహాలు, సూచనల మేరకు నడుచుకుంటానని, మరికొంతమంది ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాణ్యం చంద్రారెడ్డి, ఆనందు, హనుమంతరెడ్డి, వై.సుధా, కృష్ణమూర్తి, రిటైర్డ్ డీఎస్పీ జయచంద్ర, రిటైర్డ్ సీఐ విజయకృష్ణ, గడివేముల చంద్రశేఖరరెడ్డి, రామలక్ష్మమ్మ, గడివేముల ఎంపీటీసీ బాలచందర్, శివ, గోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, బిలకలగూడూరు చంద్రశేఖరరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వీరయ్యస్వామి పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు ప్రజల దరిచేరాలి
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ అందాలని ఆళ్లగడ్డ, పాణ్యం ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్డీఏ-ఐకేపీ, డ్వామా ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం, డీఆర్డీఏ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎంపీ అధ్యక్షత వహించాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోతే నంద్యాల ఎంపీ అధ్యక్షతన కార్యక్రమం సాగాలి. అనివార్య కారణాల వల్ల ఇద్దరు ఎంపీలు రాకపోవడంతో సీనియర్ అయిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని కానిచ్చారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి వివిధ అంశాలపై గళం విప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రూపనగుడి, మరివేముల నీటి పథకాలకు ఉయ్యాలవాడ మండలంలోని వివిధ గ్రామాలకు ఉప్పునీరు(రా వాటర్) వస్తున్నాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌తో సమీక్షించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఆ నీటిని తాగడం వల్ల రానున్న రోజుల్లో ప్రజలకు ఏదైనా జరిగితే ఆర్డబ్ల్యూఎస్ అధికారులపైనే కేసులు పెడతానని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి హెచ్చరించారు. తొలుత ఇందిరా ఆవాజ్ యోజన ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. జిల్లాకు ఐఏవై కింద 2012-13లో 10,783 ఇళ్లు మంజూరు అయితే అన్ని పూర్తి చేశామని, 2013-14లో 8,611 ఇళ్లు మంజూరైతే 3,724 ఇళ్లు నిర్మించామని హౌసింగ్ పీడీ వివరించారు. డ్వామా పీడీ హరినాథరెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్, ఇందిర జలప్రభ, ఐడబ్ల్యూఎంపీ వాటర్షెడ్లు తదితర వాటిని వివరించారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన ఫీల్డ్ అసిస్టెంట్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి ఏడాదిన్నర సమయం అవసరమా అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ కింద ఏయే నియోజకవర్గంలో ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఏయే పంటలు చేసుకోవచ్చు అనే వివరాలు ఇవ్వాలని కోరారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు. పింఛన్లను సర్పంచుతో సంబంధం లేకుండా పంపిణీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ కన్నబాబు మాట్లాడుతూ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ప్రతి ఆరు నెలలకోసారి జరగాల్సి ఉందని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఎంపీలు హాజరు కాకపోవడం వల్ల సీనియర్ ఎమ్మెల్యే ాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నాయకులు చెప్పిన సమస్యలపై స్పందిస్తామని అన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ నజీర్ సాహెబ్, డ్వామా పీడీ హరినాథరెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, హౌసింగ్ పీడీ రామసుబ్బు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.