సమావేశంలో మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి
ఓర్వకల్లు (కర్నూలు): పేదల భూములు లాక్కోవడం టీడీపీ నైజమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విమర్శించారు. కేతవరం గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయ భవనాన్ని బుధవారం.. సర్పంచు పాపన్న, ఎంపీటీసీ సభ్యుడు సుబ్బన్న ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాటసానితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటసాని మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూడిచెర్ల గ్రామానికి చెందిన రైతుల భూములను రిలయన్స్ కంపెనీకి ధారాదత్తం చేసినట్లు టీడీపీ నేత ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతుల భూములు తీసుకోకుండా ఉండేందుకు అప్పట్లో తానే స్వయంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు.
అలాగే గవర్నర్ వద్దకు రైతులను పంపి భూములు తీసుకోవడాన్ని రద్దు చేయించానన్నారు. టీడీపీ నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి నిజాలు తెలుసుకోకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎయిర్‌పోర్టు సమీపాన పూడిచెర్ల గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు సాగులో ఉన్న రైతుల భూములను రాత్రికిరాత్రి అన్‌లైన్‌లో పేర్లు మార్చిన ఘనత టీడీపీ నేతలదేనన్నారు. అక్రమాలపై కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశామని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దమ్ముంటే ఈ భూములపై విచారణ జరిపించాలని ఏరాసుకు సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మీదివేముల ప్రభాకర్‌రెడ్డి, పూడిచెర్ల రాజన్న, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment