సంక్షేమ పథకాలు ప్రజల దరిచేరాలి | welfare schemes to reach to public | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలు ప్రజల దరిచేరాలి

Published Tue, Dec 24 2013 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

welfare schemes to reach to public

కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ అందాలని ఆళ్లగడ్డ, పాణ్యం ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్‌డీఏ-ఐకేపీ, డ్వామా ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం, డీఆర్‌డీఏ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎంపీ అధ్యక్షత వహించాల్సి ఉంది. ఆయన అందుబాటులో లేకపోతే నంద్యాల ఎంపీ అధ్యక్షతన కార్యక్రమం సాగాలి. అనివార్య కారణాల వల్ల ఇద్దరు ఎంపీలు రాకపోవడంతో సీనియర్ అయిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని కానిచ్చారు.

ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి వివిధ అంశాలపై గళం విప్పారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రూపనగుడి, మరివేముల నీటి పథకాలకు ఉయ్యాలవాడ మండలంలోని వివిధ గ్రామాలకు ఉప్పునీరు(రా వాటర్) వస్తున్నాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌తో సమీక్షించినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఆ నీటిని తాగడం వల్ల రానున్న రోజుల్లో ప్రజలకు ఏదైనా జరిగితే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపైనే కేసులు పెడతానని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి హెచ్చరించారు. తొలుత ఇందిరా ఆవాజ్ యోజన ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. జిల్లాకు ఐఏవై కింద 2012-13లో 10,783 ఇళ్లు మంజూరు అయితే అన్ని పూర్తి చేశామని, 2013-14లో 8,611 ఇళ్లు మంజూరైతే 3,724 ఇళ్లు నిర్మించామని హౌసింగ్ పీడీ వివరించారు. డ్వామా పీడీ హరినాథరెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఇందిర జలప్రభ, ఐడబ్ల్యూఎంపీ వాటర్‌షెడ్‌లు తదితర వాటిని వివరించారు.

 అనంతరం కాటసాని మాట్లాడుతూ దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిన ఫీల్డ్ అసిస్టెంట్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి ఏడాదిన్నర సమయం అవసరమా అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ఏయే నియోజకవర్గంలో ఎన్ని నిధులు ఖర్చు చేశారు, ఏయే పంటలు చేసుకోవచ్చు అనే వివరాలు ఇవ్వాలని కోరారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు.  పింఛన్లను సర్పంచుతో సంబంధం లేకుండా పంపిణీ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ కన్నబాబు మాట్లాడుతూ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ప్రతి ఆరు నెలలకోసారి జరగాల్సి ఉందని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఎంపీలు హాజరు కాకపోవడం వల్ల సీనియర్ ఎమ్మెల్యే ాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నాయకులు చెప్పిన సమస్యలపై స్పందిస్తామని అన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ నజీర్ సాహెబ్, డ్వామా పీడీ హరినాథరెడ్డి, జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, హౌసింగ్ పీడీ రామసుబ్బు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement