సాక్షి, కర్నూలు : వైఎస్సార్‌సీపీ నాయకురాలు దివంగత శోభా నాగిరెడ్డి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ఏడాది పొడవునా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలోని అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న నవజీవన్ బధిరుల పాఠశాల, ఆర్‌ఎస్ రోడ్డులోని సెయింట్ లూక్ అంధుల పాఠశాలల్లో మంగళవారం శోభా నాగిరెడ్డి 46వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శోభా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్‌లు కట్ చేసి విద్యార్థులకు అందజేశారు. టీవీ, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమా మాట్లాడుతూ చిన్న వయస్సులోనే శోభాను భగవంతుడు తీసుకెళ్లడం బాధాకరమన్నారు. సమాజంలో ఎవరికీ తీసిపోని విధంగా బతికే శక్తిని బధిర, అంధ విద్యార్థులకు ప్రసాదించాలని దేవున్ని వేడుకుంటానన్నారు. శోభానాగిరెడ్డి ట్రస్టు ద్వారా విద్య, క్రీడలు,పేదవారి ఆశలను నెరవెర్చడమే తమ కర్తవ్యమన్నారు.పట్టుదలతో పనిచేసి శోభా నాగిరెడ్డి ట్రస్టు ద్వారా శోభా నాగిరెడ్డిని బతికించుకుంటామన్నారు. నంద్యాలలోని రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి మూడు చోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.
నడిగడ్డలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్‌లో శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా నంద్యాల వైద్యుల సహకారంతో కేబుల్ ఆపరేటర్ల సంఘం, ఆర్‌వీఎఫ్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి 46వ జయంతి సందర్భంగా ఆమె కుమార్తె ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రక్తదానం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డ పట్టణంలోని ఏవి కళ్యాణమండంలో శోభా నాగిరెడ్డి కుమార్తె మౌనిక, శోభా నాగిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు 200 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతు సేవా కార్యక్రమాలంటే ఆమ్మకు చాలా ఇష్టమని, అందుకే అమ్మ జయంతి రోజున సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగ పడేవిధంగా సేవా కార్యక్రమాలను చేపడతామని చెప్పారు.
ఘనంగా శోభమ్మ జయంతి
Published Wed, Dec 17 2014 2:54 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement