నేడు శోభమ్మ ప్రథమ వర్ధంతి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన శోభానాగిరెడ్డి ప్రథమ వర్ధంతి నేడు ఆళ్లగడ్డలో జరగనుంది. కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకానున్నారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని శోభానాగిరెడ్డి భర్త, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. సాధారణ ఎన్నికల సందర్భంగా గత ఏడాది నంద్యాలలో జరిగిన పార్టీ మహిళా నేత షర్మిల బహిరంగ సభ అనంతరం తిరిగి ఆళ్లగడ్డకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం శోభమ్మ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభమవుతుందని భూమా వెల్లడించారు. 9.30 గంటలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు.
ప్రముఖ గాయని, వైఎస్సార్ సీపీ సాంసృతిక విభాగం నాయకురాలు వంగపండ ఉష బృందం... శోభానాగిరెడ్డి చేసిన సేవలను వివరిస్తూ సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం 11 గంటలకు సంస్మరణ సభలో పార్టీ గౌవర అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధినేత వైఎస్ జగన్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన శోభానాగిరెడ్డి విగ్రహాలను విజయమ్మతో పాటు జగన్ ఆవిష్కరిస్తారని వివరించారు. వర్ధంతి కార్యక్రమానికి దాదాపు 20వేల నుంచి 25వేల మంది వరకూ హాజరవుతారని అంచనా.