
తుపాను నుంచి రక్షణకు సాఫ్ట్‌వేర్
- ముందుకు వచ్చిన ఐబీఎం బృందం
- సీఎస్‌ఆర్ నిధులతో అధునాతన విధానం రూపకల్పన
- జిల్లా అధికారులతో సమావేశమైన సంస్థ సభ్యులు
సాక్షి, విశాఖపట్నం: తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంలో సహకారమందించేందుకు సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఐబీఎం ముందుకొచ్చింది. విపత్తుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రణాళికను, అవసరమైన సాప్ట్‌వేర్‌ను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ సంస్థ రూపొందించి ఇవ్వనుంది. హుద్‌హుద్ అనంతరం జిల్లా కలెక్టర్ యువరాజ్ తుఫాన్‌లు ఎదుర్కొనేందుకు సమాచార వ్యవస్థల రూపకల్పనలో సహకరించాల్సిందిగా ఐబీఎంకు లేఖ రాశారు.
దీనికి స్పందించిన ఈ సంస్థ సహకరించేందుకు ముందుకొచ్చింది. సీఎస్‌ఆర్ వ్యవహారాల విభాగం అధిపతి మమతా శర్మ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం బుధవారం విశాఖ నగరాన్ని సందర్శించింది. జిల్లా అధికారులతో దీనిపై చర్చలు జరిపింది. అదనపు జాయింట్ కలె క్టర్ డి.వెంకటరెడ్డి నేతృత్వంలోని ఆ జిల్లా నగర అధికారుల బృందంతో హుద్‌హుద్ అనుభవాలు, వాటిని ఎదుర్కొన్న తీరు గురించి తెలుసుకుంది.
జీవీఎంసీ ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్, విద్యుత్ మత్స్యశాఖ, వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు తమ శాఖ ద్వారా తుఫాన్ సందర్భంగా చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఐబీఎం సీఎస్‌ఆర్ హెడ్ మమతా శర్మ మాట్లాడుతూ భవిష్యత్‌లో హుద్‌హుద్ లాంటి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు విపత్తుల్లో సైతం పనిచేసేందుకు విలువైన అధునాతన సాప్ట్‌వేర్‌ను రూపొందిస్తామని చెప్పారు. అవసరమైన శాస్త్ర, సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తామన్నారు.
సమీక్షలో జీవీఎంసీ తరపున అదనపు కమిషనర్ మోహనరావు, జీవీఎస్ మూర్తి, ప్రజారోగ్య విభాగం ఎస్‌ఈ శరత్‌బాబు, జిల్లా అగ్నిమాపకశాఖాధికారి జే.మోహనరావు, మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, జలవనరుల శాఖ ఎస్‌ఈ ఆర్.నాగేశ్వరరావు,బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ రవీంద్రకుమార్ పాల్గొన్నారు.