ఉత్తమ ఆటగాడిగా బహుమతులతో తులసయ్య
అడుగులు కదపలేని స్థితి నుంచి ఆయన గురించి గర్వంగా అడిగి తెలుసుకునే స్థాయికి ఎదిగారాయన. కాళ్లలో చలనం లేని స్థితి నుంచి సంచలనం సృష్టించేంత ఎత్తులో నిలబడ్డారాయన. చంద్రబోస్ ఒక పాటలో చెప్పినట్టు పిడికిలి బిగించి చేతిరాత మార్చుకున్నారు. చెమట్లు చిందించి నుదుటి గీత రాసుకున్నారు. అంతులేని పట్టుదలతో ఆదర్శప్రాయంగా మారారు. ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదనే వాక్యానికి రుజువుగా నిలిచారు. ఇచ్ఛాపురంలో పుట్టి తెలంగాణకు ఆటలో ప్రాతినిథ్యం వహించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన తులసయ్య గురించి
సాక్షి, ఇచ్ఛాపురం రూరల్ : ఇచ్ఛాపురం మండలం కుగ్రామం తులసిగాం గ్రామానికి చెందిన పండూరు జోగయ్య, దాలమ్మ దంపతులకు నాల్గో సంతానంగా జన్మించిన తులసయ్య 18 నెలల వరకు అందరి పిల్లల్లానే ఉండేవాడు. తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. విధి వక్రీకరించింది. జ్వరం బారిన పడిన తులసయ్యకు పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. అసలే బీద కుటుంబం, ఆపై కొడుక్కి పెద్ద కష్టం రావడంతో వేలాది రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనబడలేదు. తులసయ్య ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు స్వగ్రామంలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ధర్మపురం ఉన్నత పాఠశాలలో చదివాడు. పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి తొలి విజయాన్ని అందుకున్నారు. తోటి స్నేహితులు, అన్నదమ్ముల సాయంతో ఇచ్ఛాపురం జ్ఙానభారతిలో ఇంటర్, శ్రీకాకుళంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉన్నత విద్య చదవాలన్న కోరిక ఉన్నప్పటికీ తనవారి గురించి ఆలోచించి హైదరాబాద్‌లో ఓ చానెల్‌లో వెబ్ రిపోర్టర్‌గా చేరాడు.
అనుకోని అవకాశం..
పాఠశాలలో తోటి స్నేహితులతో క్రీడలపై ఆసక్తిని కనబర్చే తులసయ్యకు అనుకోని అవకాశం ముంగిట చేరింది. ఓ రోజు తులసయ్య ఆఫీసుకు వెళ్తుండగా అదే దారిలో చంద్రశేఖర్ అనే దివ్యాంగుడు పరిచయమయ్యాడు. తాను వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఆటగాడినని, ఆసక్తి ఉంటే తనతో రమ్మంటూ ఆహ్వానం పలికాడు. ఆటలపై మక్కువ ఉన్న తులసయ్య తన సత్తాను నిరూపించుకునేందుకు ఇదే మంచి అవకాశంగా భావించాడు. తెలంగాణా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పద్మతో పాటు కోచ్ సొహయిల్ ఖాన్‌లు తులసయ్యలో ఉన్న ప్రతిభను గుర్తించారు. సుమారు నెలన్నర రోజుల పాటు శిక్షణ పొందిన తులసయ్య అనతి కాలంలోనే వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
2018 సెప్టెంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు చెన్నై ఈరోడ్‌లో జరిగిన 5వ జాతీయ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జూన్ 24 నుండి 29 వరకు చంఢీఘర్ రాష్ట్రం మొహాలీలో జరిగిన 6వ జాతీయ వీల్ చైర్ బాస్కెట్‌బాల్ చాంపియన్ షిప్‌లో పాల్గొని మళ్లీ నాల్గో స్థానంలో నిలిచారు. జాతీయ స్థాయిలో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న తులసయ్య ఉత్తమ క్రీడాకారునిగా ఎంపికై బహుమతులు కైవసం చేసుకున్నాడు. మొక్కవోని దీక్షతో కష్టబడితే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చని నిరూపిస్తున్నాడు తులసయ్య.
ప్రభుత్వం ప్రోత్సహిస్తే...
నాకు ఆటలంటే చాలా ఇష్టం. క్రికెట్, అథ్లెటిక్స్ కూడా ఆడుతాను. కానీ నాకు అంత ఖరీదైన వీల్‌చైర్ లేదు. ఈ ఏడాది డిసెంబర్‌లో దివ్యాంగులకు రంజీ క్రికెట్ పోటీలు ఉన్నాయి. అందులో ఆడి సత్తా నిరూపించుకోవాలని ఉంది. ప్రభుత్వం నన్ను ప్రోత్సహిస్తే మరిన్ని క్రీడల్లో రాణించాలని ఉంది. ప్రస్తుతం నేను తెలంగాణ వీల్‌చైర్ బాస్కెట్ బాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాను. అవకాశం వస్తే శ్రీకాకుళం జిల్లాలో నా పేరును చిరస్థాయిగా నిలుపుకోవాలని ఉంది.
– పి.తులసయ్య, వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు
Comments
Please login to add a commentAdd a comment