ఆదర్శ మున్సిపాలిటీగా రాజంపేట
రాజంపేట: రాజంపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైన నేపథ్యంలో మంగళవారం మన్నూరు ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వార్డు సభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజంపేట మున్సిపాలిటీని పెలైట్ ప్రాజెక్టుగా గుర్తించి, ప్రగతి పథంలో పయనించేందుకు ప్రణాళిక సిద్ధం చే స్తోందన్నారు. ఈనెల 10న పూర్తి నివేదికను మున్సిపాలిటీ కలెక్టర్‌కు అంద జేస్తుందన్నారు.
దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్ వెయ్యిరూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటిన్‌ల ద్వారా మున్సిపాలిటీల్లో ఐదు రూపాయలకే భోజన వసతి కల్పిస్తామన్నారు. స్పెషలాఫీసర్, ఆర్డీఓ ఎం.విజయసునీత మాట్లాడుతూ 13జిల్లాల్లో రాజంపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసేందుకు పెలైట్ ప్రాజెక్టుపై ఎంపిక చేసిందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం వంటి సమస్యలపై ఈనెల 10న కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఈనెల 16న సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో ఒక సంస్థను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తారని ఆమె వివరించారు.
కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ ఎస్.ఫజులుల్లా, తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి, టీడీపీ నాయకులు సుధాకర్, ఉమామహేశ్వరరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.