కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: చక్కని ప్రణాళిక ఉంటే బ్యాంక్ ఉద్యోగం సాధించడం అంత కష్టమేమీ కాదని ట్రూఫెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్(టైమ్) ఫ్యాకల్టీ ప్రొఫెసర్ రామన్ తెలిపారు. అలాగే అభ్యర్థుల్లో పట్టుదల, క్రమశిక్షణ కూడా ముఖ్యంగా ఉండాలని చెప్పారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సాక్షి, టీఐఎంఇ సంయుక్తంగా శనివారం బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లరికల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, అలాగే ఐసెట్‌కు ఎలా సిద్ధం కావాలనే విషయంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రెండుపూటల జరిగిన ఈ సదస్సుకు దాదాపు 800 మంది డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సదస్సులో బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి నమూనా పరీక్ష నిర్వహించి ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందనే దానిపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ రామన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు క్రమశిక్షణతో చదవాలని తెలిపారు. బ్యాంకింగ్ రంగంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలూ భారీగానే ఉన్నాయని చెప్పారు. ఆంగ్లం, గణితం, లాజిక్ రీజనింగ్‌లో పట్టు ఉంటే ఉద్యోగాలు సాధించడం తేలిక అవుతుందని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా బ్యాంకు ఉద్యోగాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల వైపు దృష్టి సారించాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయని, అయితే సమయం తక్కువ పోటీ ఎక్కువగా ఉండటంతో కొంత గందరగోళానికి గురవుతుంటారని తెలిపారు. నిర్ణీత సమయంలో పరీక్ష రాయడానికి తగిన క్రమశిక్షణ, ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. వివిధ పోటీ పరీక్షలు రాయడానికి ఎలా ప్రణాళిక రూపొందించుకోవాలో వివరించారు.
బ్యాంకు ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరి చైర్మన్ హోదాలను పొందే అవకాశం ఉందన్నారు. ఇంటర్వ్యూ అంటే భయపడాల్సిన అవసరం లేదని, అది ముఖాముఖిగా మాట్లాడుకోవడమే అని తెలుసుకోవాలన్నారు. ఐ-సెట్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సీజీఎల్ పరీక్షలకు ఏ విధంగా సిద్ధం కావాలనే పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో టీఐఎంఇ ప్రతినిధులు కిరణ్, పవన్, హితేందర్, సత్యనారాయణ, ప్రేమ్‌సాయి, నజీర్ తదితరులు పాల్గొన్నారు. సదస్సు ద్వారా తాము ఎన్నో విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు.
బ్యాంక్ ఉద్యోగం..ప్రణాళిక ముఖ్యం
Published Mon, Dec 2 2013 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
Advertisement