నిర్లక్ష్యం చేస్తే గుణపాఠం
పార్టీలకు అర్చక శంఖారావం హెచ్చరిక
వైఎస్ సవరించిన చట్టంతో భద్రత
ఆ చట్టాన్ని అమలు చేస్తామనే వారికే ఓట్లు
హైదరాబాద్, అర్చకులను నిర్లక్ష్యం చేసే పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అర్చక శంఖారావం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అర్చక సమాఖ్యల సంయుక్తంగా బుధవారం ఇక్కడి కాచిగూడ మున్నూరుకాపు భవన్‌లో శంఖారావం సభను నిర్వహించారు. ఈ సభను అర్చక శంఖారావం కన్వీనర్ డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చక సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రం లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, డిమాండ్లను ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యలు పరిష్కరించే పార్టీలకే మద్దతు ఉంటుం దని వారు పేర్కొన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సవరించిన చట్టాన్ని అమలు చేయాలని, ఆ చట్టం వల్లే దేవాలయాల పునరుద్ధరణ జరిగిందని, అర్చకులకు భద్రత ఏర్పడిందని తెలిపారు. ఆ చట్టాన్ని అమలు చేస్తామనే హామీ ఇచ్చిన వారికే ఓటేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వాల నిర్వాకం వల్ల అర్చకులు వీధిన పడుతున్నారని, వేతనాలు లేవని, అన్యాక్రాంతం అవుతున్న దేవాలయ భూములను కాపాడటంలో దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని పేర్కొన్నారు. తమ వేతనాలు ట్రెజరీ ద్వారా చెల్లించాలని, సెక్షన్ 43 రిజిష్టర్‌లో వాటాదారులుగా ఉన్న అర్చకుల అందరి పేర్లను నమోదు చేయాలని, జిఓనెం261 ప్రకారం ఆలయాల ఆదాయాన్ని బట్టి అర్చకులకు కేడర్ స్ట్రెన్త్ ఏర్పాటు చేయాలని అన్నారు. ధార్మిక పరిషత్ నిర్ణయించిన ప్రకారం అర్చకులకు కనీస వేతనం ఇవ్వాలని, ఆలయ ఆదాయాన్ని బట్టి కమిషనర్ సర్క్యులర్ ప్రకారం పడితరం పెంచాలని డిమాండ్ చేశారు. అర్చకుల స్వాధీనంలో గల భూములకు పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలన్నారు.
ఆలయాలల్లో అనాదిగా ఉన్న ఆచార వ్యవహారాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ అర్చక సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎల్డీ నేత, ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్, వైఎస్‌ఆర్‌సీపీ నేత జనక్‌ప్రసాద్, టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, కాంగ్రెస్‌నేత అశోక్ చౌదరి, బీజేపీ నాయకులు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చండీ హోమం నిర్వహించిన అనంతరం అర్చక భవన్ నుంచి వందలాది మంది అర్చకులు సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిలో అర్చక సమాఖ్య ప్రతినిధులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, మురళీధర్‌రావు దేశ్‌పాండే, శ్రీకంఠం నందీశ్వర్, పెద్దింటి రాంబాబు, డాక్టర్ అనంతాచార్యులు, భాస్కరభట్ల రామశర్మ, తనుగుల రత్నాకర్, ఎవీఎస్‌ఆర్‌ఎస్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.