
అన్నం ఇంత ముద్దగా ఉంటే ఎలా తింటారు?
రామేశ్వరం హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన పీఓ
ప్రొద్దుటూరు టౌన్ : ఇంత ముద్దగా అన్నం వండితే పిల్లలు తింటారా అని రాజీవ్ విద్యామిషన్ పీఓ, మెప్మా పీడీ వెంకటసుబ్బయ్య వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. గురువారం పట్టణం, మండలంలో ఆయన పలు స్కూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని రామేశ్వరం మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థుల రికార్డులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తయారు చేస్తున్న షెడ్ వద్దకు వెళ్లి బిల్లులు వస్తున్నాయా అని వారిని ప్రశ్నించారు.
అన్నం ముద్ద ముద్దగా ఉండటాన్ని పరిశీలించిన ఆయన ఇలా ఉంటే పిల్లలు ఎలా తింటారన్నారు. బియ్యం కొత్తవి కావడంతో అన్నం అలా అవుతుందని ఏజెన్సీ నిర్వాహకులు పీఓ దృష్టికి తీసుకెళ్లారు. మండల పరిధిలోని ఎర్రగుంట్లపల్లి, బొజ్జవారిపల్లెల్లో ఉన్న పాఠశాలలను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 2,600 మరుగుదొడ్లను నిర్మిస్తున్నామని, ఇందులో 1800 వరకు పూర్తి కావస్తున్నాయని, మి గిలిన 800 కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.