కమలాపురం, న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాల వారికి నష్టమేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త పి.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం పట్టణంలో చేపట్టిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలో ఆయన మరో సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డితో కలసి మాట్లాడారు.
రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలకు నష్టమేనన్నారు. 6.5కోట్ల మంది మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమన్నారు. యూపీఏ-2 ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్యంపై చిత్తశుద్ధిని నిరూపించు కోవాలన్నారు. మరో సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ యూపీఏ-2 ప్రభుత్వ ఏర్పాటుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రం నుంచి 33 ఎంపీ సీట్లను కేంద్రానికి ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారన్నారు. అలాంటి రాష్ట్రాన్ని విభజించడానికి సోనియాకు చేతులెలా వచ్చాయని ప్రశ్నించారు.