రైతు సంతోషంగా ఉంటే దేశం సస్యశ్యామలం | If the farmer is happy country is evergreen | Sakshi
Sakshi News home page

రైతు సంతోషంగా ఉంటే దేశం సస్యశ్యామలం

Published Sat, Dec 21 2013 1:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

If the farmer is happy country is evergreen

 విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్: రైతు ఆనందంగా ఉంటే దేశం సస్య శ్యామలంగా ఉంటుందని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడే ప్రమాణాలను మేనిఫెస్టోల్లో పొందుపరిచిన పార్టీలకు మద్దతిస్తామని స్పష్టంచేశారు. గుంటూరులో మూడు రోజులపాటు జరిగిన జాతీయ రైతు సమ్మేళనం మహాసభలు శుక్రవారం ముగిశాయి. కొత్తపేట మల్లయ్య లింగం భవన్‌లో నిర్వహించిన ముగింపు సమావేశంలో అతుల్‌కుమార్ మాట్లాడుతూ సమావేశాల్లో రైతుల అభివృద్ధి, ఆర్థిక భద్రతకు నూతన ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ ప్రణాళికలో రైతులకు వడ్డీలేని ఋణాలు నేరుగా 10 శాతం సబ్సిడీతో ఇవ్వాలని, రైతు కూలీలకు జీవన భృతికి నెలకు రూ3వేలు అందించాలని డిమాండ్ చేశారు. పంటలకు  మద్దతు ధర, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

 ఈ విధమైన ప్రమాణాలను రానున్న ఎన్నికల్లో ఏపార్టీ తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యతనిస్తుందో ఆపార్టీకి తమ మద్దతు తెలుపుతామన్నారు. కాంగ్రెస్ దాని తొత్తు పార్టీల నిర్లక్షం వల్ల దేశంలో రైతులు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. దేశంలో నిత్యావసర సరుకులు నుంచి అన్నింటికీ ధరలు పెంచి పంటలకు మాత్రం మద్దతు ధర కల్పించలేదన్నారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోద్‌పాండా మాట్లాడుతూ వ్యవసాయంలో నేటి నుంచి కొత్త ఒరవడి రానుందన్నారు. రానున్న ఎన్నికల్లో రైతుల చైతన్యంతో నూతన చారిత్రాత్మకమైన మార్పులు జరుగనున్నాయన్నారు. రైతులకు రైతు కూలీలకు న్యాయం చేసే నాయకుడినే ఎన్నుకుంటారని దీంతో రైతులకు ప్రభుత్వానికి మద్య అవాంతరాలు తొలగి రైతు క్షేమం మొదలౌతుందన్నారు.
 ఏపీ రైతుసంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ 1998 నుంచి 2004 వరకూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా దేశ వ్యాప్తంగా రైతులు 1.54 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు.

అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు రైతులను నిర్లక్ష్యంచేసి రైతుల ఆత్మహత్యలకు కారకుడయ్యాడని తెలిపారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వాలు నేడు ఎన్నికల సమయం ఆసన్న మవటంతో రైతులు వారి సంక్షేమం అంటూ మాయమాటలు చెబుతున్నారన్నారు. ఏపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్యపద్మ మాట్లాడుతూ రైతులకు, పేద ప్రజలకు మహారాష్ట్ర నెలకు రూ.650, గోవా రూ.1500, కేరళ రూ.500, హర్యానా రూ.1000 జీవనభృతి ఇస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రైతులకు గుర్తింపుకూడా లేక పోవడం విచారకరమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరారవు మాట్లాడుతూ మహాసభల సందర్భంగా దేశ వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపి రైతులు ఆర్థికంగా బలపడేలా ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏకేఎస్ జిల్లా నాయకులు వివిధ రాష్ట్రాల నాయకులు ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement