vidyanagar
-
బైక్‌ను ఢీకొన్న బస్సు: విద్యార్థి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: విద్యానగర్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. విద్యార్థి ప్రయాణిస్తున్న బైక్‌ను స్థానిక వివేకానంద డిగ్రీ కాలేజీ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో సెయింట్ మేరిస్ కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి రోణి సిరిల్(17) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు రాంనగర్ నివాసిగా తెలుస్తోంది. -
ఫ్రెండ్స్ తెచ్చిన బైకు..
ఒక్కొక్కరిదీ ఒకో ఆర్థిక లక్ష్యం. బైక్ కొనాలి.. కారు కొనాలి. పిల్లల చదువు, పెళ్లి. ఇలా చాలా!. వాటిని చేరుకోవడానికి ఒకొక్కరిదీ ఒకో మార్గం. కొందరి మార్గాలు కొత్తగా ఉంటాయి. అన్నీ అనుసరణీయం కాకపోవచ్చు. కానీ తెలుసుకుంటే మరో ఐడియా రావచ్చు కదా... ఈ శ్రీనివాస్ స్టోరీ చూడండి. నాది మీడియాలో ఉద్యోగం. విద్యానగర్‌లో నివాసం. బంజారాహిల్స్‌లోని ఆఫీసుకు వెళ్లాలంటే బస్సే దిక్కు. చుక్కలు కనిపించేవి. రూమ్మేట్తో కలిసి టూవీలర్ కొనాలనుకున్నా. షోరూమ్‌లకు వెళ్లినా... మీడియాలో జాబ్ కనక నో లోన్స్ అన్నారు. చివరకో ఫైనాన్స్ యజమాని సలహా ఇచ్చాడు. బైక్ విలువలో సగం డౌన్ పేమెంట్‌గా చెల్లిస్తే మిగతాది లోన్ ఇస్తామన్నాడు. నా మిత్రుడు దానికోసం వచ్చే ఆరువేల జీతంలో నెలకు రూ.2వేలు తీసి పక్కనబెట్టడం మొదలెట్టాడు. ఏడాదిపాటు అలా పొదుపుచేసి.. డౌన్‌పేమెంట్ కట్టేశాడు. బైక్ తెచ్చేసుకున్నాడు. నా సంగతికొస్తే... అప్పుడే లక్కీగా వేరే మిత్రుడు బైక్ కొనుక్కుని తన స్కూటర్ నాకు ఇచ్చేశాడు. ఏడాది గడిచాక తన బావమరిదికి అవసరముందని తీసుకెళ్లిపోయాడు. నా కథ మళ్లీ మొదటికి. నా రూమ్మేట్లా నెలకు 2,000 పొదుపు చేసి, ఏడాది వెయిట్ చేయటమంటే చాలా కష్టం. డౌన్‌పేమెంట్‌కు అర్జెంటుగా పాతికవేలు కావాలి!! అందరం చిరుద్యోగులమే కనక అంత మొత్తం అప్పిచ్చే ఫ్రెండ్స్ లేరు. సమాన వాయిదాల్లో చెల్లించేలా 10 మంది దగ్గర అప్పుతీసుకుంటే బాగుంటుంది కదా... అనుకున్నా. జాబితా రాసుకున్నా. లక్కీగా ఐదుగురు తలా ఐదువేలివ్వటంతో పాతికవేలు చేతికొచ్చేశాయి. అది డౌన్ పేమెంట్‌గా కట్టి కొత్త బైక్ తీసుకున్నా. అప్పుడే జీతం 3వేలు పెరిగింది. బైక్‌లోన్ నెలకు రూ.3వేలు ఫైనాన్స్ కంపెనీకి కట్టేవాణ్ణి. వీలును బట్టి, అప్పిచ్చిన మిత్రుల అవసరాలను బట్టి వాళ్లకి తీర్చేవాణ్ణి. నెలకు రూ.1,000 చొప్పున ముగ్గురికి ఇచ్చా. ఒకోనెల రూ.3,000 ఒక్కడికే ఇచ్చేవాణ్ణి. ఏడాది తిరగిసరికల్లా అటు లోను, ఇటు అప్పు రెండూ తీరిపోయాయి. అవసరానికి సాయపడే మంచి మిత్రులున్నారు కనక నాకు ఇది సాధ్యమైంది. అందరికీ కాకపోవచ్చు కూడా. కాకుంటే ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని మరిచిపోవద్దు. - జి. శ్రీనివాస్, వేములవాడ -
ఆధార్ అనుసంధానం అన్యాయం
విద్యానగర్,న్యూస్‌లైన్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయటం అన్యాయమని విద్యార్థులు ధ్వజమెత్తారు. దానివల్ల ఎందరో విద్యార్థులు నష్టపోతున్నారంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం సంక్షేమశాఖ భవన్‌ను ముట్టడించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అయ్య స్వామి, అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ ఆధార్ అనుసంధానం వల్ల ఆధార్‌లేనివారు, పేర్లు తదితరాలు తప్పు ఉన్నవారు తీవ్రంగా నష్ట పోతున్నారని చెప్పారు. వెంటనే ఆధార్ అనుసంధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఆధార్‌తో అర్జీలు పెట్టుకున్నారని, మిగిలిన 40 శాతం మంది విద్యార్థులు ఆధార్లేక ఫీజు రీఎంబర్స్మెంట్ పొందలేకపోతున్నారని వాపోయారు. ఆధార్ లింక్ ఉపసంహరించాలని నినాదాలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. విధ్యార్థులు సంక్షేమభవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
రైతు సంతోషంగా ఉంటే దేశం సస్యశ్యామలం
విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్: రైతు ఆనందంగా ఉంటే దేశం సస్య శ్యామలంగా ఉంటుందని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడే ప్రమాణాలను మేనిఫెస్టోల్లో పొందుపరిచిన పార్టీలకు మద్దతిస్తామని స్పష్టంచేశారు. గుంటూరులో మూడు రోజులపాటు జరిగిన జాతీయ రైతు సమ్మేళనం మహాసభలు శుక్రవారం ముగిశాయి. కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో నిర్వహించిన ముగింపు సమావేశంలో అతుల్‌కుమార్ మాట్లాడుతూ సమావేశాల్లో రైతుల అభివృద్ధి, ఆర్థిక భద్రతకు నూతన ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ ప్రణాళికలో రైతులకు వడ్డీలేని ఋణాలు నేరుగా 10 శాతం సబ్సిడీతో ఇవ్వాలని, రైతు కూలీలకు జీవన భృతికి నెలకు రూ3వేలు అందించాలని డిమాండ్ చేశారు. పంటలకు మద్దతు ధర, బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ విధమైన ప్రమాణాలను రానున్న ఎన్నికల్లో ఏపార్టీ తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యతనిస్తుందో ఆపార్టీకి తమ మద్దతు తెలుపుతామన్నారు. కాంగ్రెస్ దాని తొత్తు పార్టీల నిర్లక్షం వల్ల దేశంలో రైతులు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. దేశంలో నిత్యావసర సరుకులు నుంచి అన్నింటికీ ధరలు పెంచి పంటలకు మాత్రం మద్దతు ధర కల్పించలేదన్నారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు ప్రబోద్పాండా మాట్లాడుతూ వ్యవసాయంలో నేటి నుంచి కొత్త ఒరవడి రానుందన్నారు. రానున్న ఎన్నికల్లో రైతుల చైతన్యంతో నూతన చారిత్రాత్మకమైన మార్పులు జరుగనున్నాయన్నారు. రైతులకు రైతు కూలీలకు న్యాయం చేసే నాయకుడినే ఎన్నుకుంటారని దీంతో రైతులకు ప్రభుత్వానికి మద్య అవాంతరాలు తొలగి రైతు క్షేమం మొదలౌతుందన్నారు. ఏపీ రైతుసంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.రామకృష్ణ మాట్లాడుతూ 1998 నుంచి 2004 వరకూ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా దేశ వ్యాప్తంగా రైతులు 1.54 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు రైతులను నిర్లక్ష్యంచేసి రైతుల ఆత్మహత్యలకు కారకుడయ్యాడని తెలిపారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వాలు నేడు ఎన్నికల సమయం ఆసన్న మవటంతో రైతులు వారి సంక్షేమం అంటూ మాయమాటలు చెబుతున్నారన్నారు. ఏపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు పశ్యపద్మ మాట్లాడుతూ రైతులకు, పేద ప్రజలకు మహారాష్ట్ర నెలకు రూ.650, గోవా రూ.1500, కేరళ రూ.500, హర్యానా రూ.1000 జీవనభృతి ఇస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రైతులకు గుర్తింపుకూడా లేక పోవడం విచారకరమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరారవు మాట్లాడుతూ మహాసభల సందర్భంగా దేశ వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపి రైతులు ఆర్థికంగా బలపడేలా ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏకేఎస్ జిల్లా నాయకులు వివిధ రాష్ట్రాల నాయకులు ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు క్షేమమే దేశ క్షేమం
విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్: రైతు సుఖంగా ఉంటేనే దేశంలో ప్రజల ంతా సంతోషంగా ఉంటారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు లక్ష్మీపురంలోని అభ్యుదయ మహిళా కళాశాలలో నెల 18 నుంచి ప్రాంభించనున్న జాతీయ రైతు సమ్మేళనం కార్యక్రమానికి అనుబంధంగా రైతు జీవన చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ వ్యవసాయరంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందని రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. జాతీయ వ్యవసాయ విధానం అమలు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ ఉద్దేశంతోనే చేపట్టిన జాతీయ రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ గిట్టుబాటు ధరల్లేక రైతులు నష్టాల పాలవుతున్నారని చెప్పారు. లాభసాటి వ్యవసాయం చేసేందుకు ఈనెల 18, 19, 20 తేదీల్లో గుంటూరులో జాతీయ రైతు సమ్మేళనాన్ని నిర్వహించనున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు రైతుల జీవన విధాన చిత్రలేఖన పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రవీంద్ర, అయ్యస్వామి, సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ కన్నా మాస్టారు తదితరులు పాల్గొన్నారు.