ఫ్రెండ్స్ తెచ్చిన బైకు..
ఒక్కొక్కరిదీ ఒకో ఆర్థిక లక్ష్యం. బైక్ కొనాలి.. కారు కొనాలి. పిల్లల చదువు, పెళ్లి. ఇలా చాలా!. వాటిని చేరుకోవడానికి ఒకొక్కరిదీ ఒకో మార్గం. కొందరి మార్గాలు కొత్తగా ఉంటాయి. అన్నీ అనుసరణీయం కాకపోవచ్చు. కానీ తెలుసుకుంటే మరో ఐడియా రావచ్చు కదా... ఈ శ్రీనివాస్ స్టోరీ చూడండి.
నాది మీడియాలో ఉద్యోగం. విద్యానగర్‌లో నివాసం.
బంజారాహిల్స్‌లోని ఆఫీసుకు వెళ్లాలంటే బస్సే దిక్కు. చుక్కలు కనిపించేవి. రూమ్మేట్‌తో కలిసి టూవీలర్ కొనాలనుకున్నా. షోరూమ్‌లకు వెళ్లినా... మీడియాలో జాబ్ కనక నో లోన్స్ అన్నారు. చివరకో ఫైనాన్స్ యజమాని సలహా ఇచ్చాడు. బైక్ విలువలో సగం డౌన్ పేమెంట్‌గా చెల్లిస్తే మిగతాది లోన్ ఇస్తామన్నాడు. నా మిత్రుడు దానికోసం వచ్చే ఆరువేల జీతంలో నెలకు రూ.2వేలు తీసి పక్కనబెట్టడం మొదలెట్టాడు. ఏడాదిపాటు అలా పొదుపుచేసి.. డౌన్‌పేమెంట్ కట్టేశాడు. బైక్ తెచ్చేసుకున్నాడు.
నా సంగతికొస్తే... అప్పుడే లక్కీగా వేరే మిత్రుడు బైక్ కొనుక్కుని తన స్కూటర్ నాకు ఇచ్చేశాడు. ఏడాది గడిచాక తన బావమరిదికి అవసరముందని తీసుకెళ్లిపోయాడు. నా కథ మళ్లీ మొదటికి. నా రూమ్మేట్‌లా నెలకు 2,000 పొదుపు చేసి, ఏడాది వెయిట్ చేయటమంటే చాలా కష్టం. డౌన్‌పేమెంట్‌కు అర్జెంటుగా పాతికవేలు కావాలి!! అందరం చిరుద్యోగులమే కనక అంత మొత్తం అప్పిచ్చే ఫ్రెండ్స్ లేరు. సమాన వాయిదాల్లో చెల్లించేలా 10 మంది దగ్గర అప్పుతీసుకుంటే బాగుంటుంది కదా... అనుకున్నా.
జాబితా రాసుకున్నా. లక్కీగా ఐదుగురు తలా ఐదువేలివ్వటంతో పాతికవేలు చేతికొచ్చేశాయి. అది డౌన్ పేమెంట్‌గా కట్టి కొత్త బైక్ తీసుకున్నా. అప్పుడే జీతం 3వేలు పెరిగింది. బైక్‌లోన్ నెలకు రూ.3వేలు ఫైనాన్స్ కంపెనీకి కట్టేవాణ్ణి. వీలును బట్టి, అప్పిచ్చిన మిత్రుల అవసరాలను బట్టి వాళ్లకి తీర్చేవాణ్ణి. నెలకు రూ.1,000 చొప్పున ముగ్గురికి ఇచ్చా.
ఒకోనెల రూ.3,000 ఒక్కడికే ఇచ్చేవాణ్ణి. ఏడాది తిరగిసరికల్లా అటు లోను, ఇటు అప్పు రెండూ తీరిపోయాయి. అవసరానికి సాయపడే మంచి మిత్రులున్నారు కనక నాకు ఇది సాధ్యమైంది. అందరికీ కాకపోవచ్చు కూడా. కాకుంటే ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని మరిచిపోవద్దు. - జి. శ్రీనివాస్, వేములవాడ